Who Is Dilshan Madushanka: ఢిల్లీతో మ్యాచ్‌లో IPL అరంగేట్రం చేసిన దిల్షాన్ మధుశంక.. ఈ SRH బౌలర్ ప్రత్యేకత ఏంటీ ?
Who Is Dilshan Madushanka: లంక క్రికెటర్ దిల్షాన్ మధుశంక మంగళవారం తన IPL అరంగేట్రం చేశాడు. గతంలో భారత్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా 5 వికెట్లు పడగొట్టాడు.

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ దిల్షాన్ మదుశంక మంగళవారం (ఏప్రిల్ 21న) ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతను తన దేశం శ్రీలంకకు చెందిన పథుమ్ నిస్సంకను అవుట్ చేయడం ద్వారా తన మొదటి IPL వికెట్‌ను సాధించాడు. మదుశంక 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. 2023లో భారత్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు కూడా ఉన్నాయి.
దిల్షాన్ మదుశంకను సన్‌రైజర్స్ హైదరాబాద్ నేరుగా వేలంలో కొనుగోలు చేయలేదు. కానీ అతను రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చాడు. విదేశీ ఆటగాడు బ్రైడన్ కార్స్ స్థానంలో రూ. 75 లక్షల మొత్తంతో మదుశంక SRHలో చేరాడు. అంతకుముందు అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కారణంగా ముంబై ఇండియన్స్ గతంలో కొనుగోలు చేసింది. 2024లో MI మదుశంకను రూ. 4.60 కోట్లకు కొనుగోలు చేసింది. గాయం కారణంగా మదుశంక ఆ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేయకుండానే తప్పుకున్నాడు.
ఎవరీ దిల్షాన్ మదుశంక
దిల్షాన్ మదుశంక (Dilshan Madushanka) 2000 జనవరి 18న శ్రీలంకలోని హంబన్‌తోట నగరంలో జన్మించాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మదుశంక శ్రీలంక జట్టు తరపున 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మదుశంక 2022లో తన మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ సైతం ఆడాడు. 2023 జనవరి 10న వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అతని మొదటి మ్యాచ్ టీమ్ ఇండియాతో జరిగింది. ఇందులో ఒక వికెట్ తీశాడు. అయితే ఇప్పటి వరకు మదుశంక అత్యుత్తమ స్పెల్ భారత్‌పైనే నమోదైంది.
భారత్‌పైనే బెస్ట్ స్పెల్
లంక పేసర్ దిల్షాన్ మదుశంక 28 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఒకసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అతని ఈ స్పెల్ భారత్‌తోనే టీమిండియాపై జరిగింది. 2023 నవంబర్ 2న వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో లంక పేసర్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి దిగ్గజ బ్యాటర్లను అవుట్ చేసి 5 వికెట్ల హాల్ సాధించాడు. ఈ ఐదుగురు మ్యాచ్ విన్నర్లు కావడంతో మదుశంకతో మంచి గుర్తింపు లభించింది.
మదుశంక క్రికెట్ కెరీర్
మదుశంక తన కెరీర్‌లో లంక తరఫున 1 టెస్ట్, 28 వన్డేలు, 19 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 50 వికెట్లు, టీ20ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ కాకుండా మదుశంక పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL), ఇంటర్నేషనల్ లీగ్ టీ20, లంక ప్రీమియర్ లీగ్‌లలో ఆడాడు. 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన మదుశంక 47 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏ లోని 50 మ్యాచ్‌ల్లో అతని ఖాతాలో 92 వికెట్లు ఉన్నాయి. లీగ్, అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిపి అతను మొత్తం 64 టీ20 మ్యాచ్‌లాడగా 62 వికెట్లు తీశాడు.
ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతడు మొదట ప్లేయింగ్ 11లో లేడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ కు దిగి నిర్ణీత ఓవరల్లో 242 పరుగుల భారీ స్కోరు చేసింది. బౌలింగ్ సమయంలో ట్రావిస్ హెడ్ స్థానంలో దిల్షాన్ మదుశంకను ఇంపాక్ట్ ప్లేయర్‌గా SRH బరిలోకి దించింది.
Before You Go
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
ట్రెండింగ్ వార్తలు




















