Sunil Gavaskar : రోహిత్ అలసిపోయాడన్న గవాస్కర్ , హార్దిక్ ఎంపిక సరైందే
Sunil Gavaskar: ముంబై ఇండియన్స్‌లో జరిగిన ఈ పరిణామాలపై తొలిసారి దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్లో సారథ్య బాధ్యతలతో రోహిత్ కాస్త అలిసిపోయి ఉండవచ్చన్నాడు
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు భగ్గుమంటున్నారు. ఎక్స్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ ఖాతాను ఆన్‌ఫాలో చేసేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ భారీగా ఫాలోవర్లను కోల్పోయింది. ఎక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలమంది ముంబైను అన్‌ఫాలో చేస్తున్నారు. ముంబైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్‌ను ఆడుతుండగానే ఎలా కెప్టెన్సీ నుంచి తప్పిస్తారంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌లో జరిగిన ఈ పరిణామాలపై తొలిసారి దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. జట్టును కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. కొన్నేళ్లుగా బ్యాటింగ్‌లో రోహిత్‌శర్మ ప్రదర్శన తగ్గిందని తెలిపాడు.
ముంబయి కెప్టెన్‌గా హార్దిక్ నియామకం సరైనదా.. కాదా... అని చూడాల్సిన అవసరం లేదని గవాస్కర్ అన్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చడం కోసమే ముంబై యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని... జట్టు ప్రదర్శన కూడా పడిపోయిందని గుర్తు చేశాడు. బ్యాటుతో రోహిత్ సహకారం కాస్త తగ్గిందనే చెప్పాలన్న గవాస్కర్... గతంలో బ్యాటింగ్‌లో రోహిత్ భాగస్వామ్యం ఎక్కువగా ఉండేదన్నాడు. నిరంతరంగా క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్‌లో, ఐపీఎల్లో సారథ్య బాధ్యతలతో రోహిత్ కాస్త అలిసిపోయి ఉండవచ్చని.... పాండ్యా యువ కెప్టెన్‌గా మంచి ఫలితాలు సాధించాడని గవాస్కర్ అన్నాడు. కొన్నేళ్లలో ముంబయి 9, 10 స్థానాల్లో నిలిచిందని గుర్తు చేశాడు. ముంబయిలో మునుపటి జోష్ కనిపించలేదని....రోహిత్ ఏకధాటిగా క్రికెట్ ఆడటం దీనికి కారణం కావచ్చని గవాస్కర్ అన్నాడు. గుజరాత్ టైటాన్స్‌ను వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు తీసుకెళ్లి.. ఒకసారి విజేతగా నిలిపి హార్దిక్ పాండ్యా తనను తాను నిరూపించుకున్నాడని గవాస్కర్ అన్నాడు. కొన్నిసార్లు జట్టుకు కొత్త ఆలోచనలు అవసరమని అందుకే హార్దిక్‌ను కెప్టెన్ చేశారని అన్నాడు. ఈ నిర్ణయంతో ముంబైకి లాభమే తప్ప నష్టం లేదని గవాస్కర్ తేల్చేశాడు.
గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ మధ్యే తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై ముంబయి చేసిన ప్రత్యేక ట్వీట్ వైరల్‌గా మారింది. 2013లో రోహిత్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు తమను ఒక్కటే అడిగాడని...తమ మీద నమ్మకం ఉంచాలని చెప్పాడని ట్వీట్‌లో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ గుర్తు చేసుకుంది. గెలుపైనా.. ఓటమైనా నవ్వుతూ ఉండాలని చెప్పావని... పదేళ్ల కెప్టెన్సీ కెరీర్‌లో ఆరు ట్రోఫీలు సాధించావని... దిగ్గజాల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ జట్టును ముందుండి నడిపించావని... ముంబై ఇండియన్స్ ఆ ట్వీట్ రోహిత్‌కు ధన్యవాదాలు తెలిపింది. ధన్యవాదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ ముంబయి ఇండియన్స్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మరోవైపు ముంబయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ అందించిన సేవలను కొనియాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ట్వీట్ చేసింది. 2013 నుంచి 2023.. దశాబ్దకాలంపాటు ఎన్నో సవాళ్లకు స్ఫూర్తిగా రోహిత్ నిలిచాడని కొనియాడింది. రోహిత్.. మీద తమకు చాలా గౌరవం ఉందని పేర్కొంటూ ధోనీ-రోహిత్ ఫొటోను CSK షేర్ చేసింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ ఎమోజీని పోస్టు చేశాడు.