SRH Vs KKR: గెలిచే మ్యాచ్ ఓడిపోయిన సన్‌రైజర్స్ - ఉప్పల్‌లో రైడర్స్‌దే విజయం!
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదు పరుగులతో విజయం సాధించింది.
Punjab Kings vs Kolkata Knight Riders: ఐపీఎల్ 2023 సీజన్ 47వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమి పాలైంది. చివరి ఐదు ఓవర్లలో 38 పరుగులు చేయాల్సిన దశలో కేవలం 32 పరుగులు మాత్రమే ఓడిపోయింది. చివరి ఐదు ఓవర్లలో మూడు ఓవర్లను వేసిన వరుణ్ చక్రవర్తి తన 18 బంతుల్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్ ఓటమి రాత రాశాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్‌కతా తరఫున రింకూ సింగ్ (46: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరి ఐదు ఓవర్లలో కోల్‌కతా కేవలం 42 పరుగులే చేయగలిగింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (41: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు) అత్యధిక పరుగులు సాధించాడు.
ఆశలు రేకెత్తించి... చివర్లో చేతులెత్తి...
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు బోర్డు మీద 37 పరుగులు చేరేసరికి ఓపెనర్లు అభిషేక్ శర్మ (9: 10 బంతుల్లో, ఒక ఫోర్), మయాంక్ అగర్వాల్ (18: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) అవుటయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రాహుల్ త్రిపాఠి (20: 9 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ఎక్కువ సేపు నిలబడలేదు. రూ.13 కోట్ల హ్యారీ బ్రూక్ (0: 4 బంతుల్లో) డకౌట్ అయ్యాడు. దీంతో 54 పరుగులకే సన్‌రైజర్స్ నాలుగు వికెట్లు కోల్పోయింది.
అయితే కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (41: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (36: 20 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరు ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించి హైదరాబాద్‌ను లక్ష్యం వైపు నడిపించారు. అయితే వీరిద్దరూ అవుటయ్యాక హైదరాబాద్ ఛేదనలో వెనకబడింది. చివర్లో సమద్ (21: 18 బంతుల్లో, మూడు ఫోర్లు) బౌండరీలతో ఆశలు రేకెత్తించినా మ్యాచ్ ముగించే సత్తా చూపించలేకపోయాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 166 పరుగులకే పరిమితం అయింది.
చివర్లో చతికిలబడ్డ కోల్‌కతా
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మార్కో జాన్సెన్ కోల్‌కతాను దెబ్బ తీశాడు. రహ్మనుల్లా గుర్బాజ్ (0: 1 బంతి), వెంకటేష్ అయ్యర్‌లను (7: 4 బంతుల్లో, ఒక ఫోర్) పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో కోల్‌కతా 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే జేసన్ రాయ్ (20: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు) కూడా అవుట్ అయ్యాడు.
అయితే కెప్టెన్ నితీష్ రాణా (42: 31 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), రింకూ సింగ్ (46: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు నాలుగో వికెట్‌కు 6.4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యం బలపడుతున్న బలపడుతున్న దశలో కెప్టెన్ మార్క్రమ్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో నితీష్ రాణాను పెవిలియన్ బాట పట్టించాడు. అతని స్థానంలో వచ్చిన విధ్వంసక బ్యాటర్ ఆండ్రీ రసెల్ (24: 15 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రసెల్ అవుటయ్యాడు.
అనంతరం జట్టు పరుగుల వేగం పూర్తిగా మందగించింది. చివరి ఐదు ఓవర్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కేవలం 42 పరుగులే చేయగలిగింది. ముఖ్యంగా నటరాజన్ తన చివరి రెండు ఓవర్లలో 10 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.