Shubman Gill: క్వాలిఫయర్ 2లో రికార్డులు బద్దలుకొట్టిన గిల్ - డేంజర్‌లో కోహ్లీ రికార్డు!
ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ క్వాలిఫయర్ 2లో కొన్ని రికార్డులు బద్దలు కొట్టాడు.
Shubman Gill IPL Century Record: ఐపీఎల్ 16వ సీజన్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 129 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి ఈ ఇన్నింగ్స్ సాయపడింది. దీని ఆధారంగా గుజరాత్ టైటాన్స్ (GT) ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ సీజన్‌లో తన మూడో సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా కొన్ని పాత రికార్డులను కూడా బద్దలు కొట్టాడు శుభ్‌మన్ గిల్.
ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు బ్యాట్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. గిల్ ఇప్పటివరకు 16 ఇన్నింగ్స్‌ల్లో 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలతో పాటు నాలుగు అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా ఉన్నాయి. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న ఫైనల్లో 123 పరుగులు చేస్తే 2016లో విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డును బద్దలు కొడతాడు.
ప్లేఆఫ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
129 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆధారంగా, ఇప్పుడు ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. గతంలో ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 122 పరుగులతో మొదటి స్థానంలో, షేన్ వాట్సన్ 117 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు.
రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు
ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన లోకేష్ రాహుల్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, గిల్ 129 పరుగుల ఇన్నింగ్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు.
రెండో అత్యధిక బౌండరీలు
ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక బౌండరీలు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత శుభ్‌మన్ గిల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. 2016 సీజన్‌లో కోహ్లి మొత్తం 122 బౌండరీలు కొట్టాడు. మరోవైపు ఈ సీజన్‌లో గిల్ ఇప్పటివరకు 111 బౌండరీలు బాదాడు. ఫైనల్లో మరో 12 బౌండరీలు కొడితే ఈ రికార్డు కనుమరుగు అవుతుంది.
ఒక సీజన్‌లో 800 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో ఆటగాడు
ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ 851 పరుగులు చేశాడు. ఒక సీజన్‌లో 800 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ 2016 సీజన్‌లో 973 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 2022 సీజన్‌లో 863 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 2022 సీజన్‌లో 848 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు 851 పరుగులతో గిల్ ఈ జాబితాలో చేరిన నాలుగో ఆటగాడు అయ్యాడు.
ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు
ముంబైతో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ కూడా తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు వృద్ధిమాన్ సాహా, క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్ పేరిట ఉంది. వీరంతా తమ ఇన్నింగ్స్‌లో ఎనిమిదేసి సిక్సర్లు బాదారు.