Romario Shepherd And Khaleel Ahmed ఖలీల్ అహ్మద్ ఓవర్‌లో రొమారియో షెఫర్డ్ ఊచకోత - ఈ మ్యాచ్ రికార్డులు ఇవే
Expensive Over In IPL 2025: ఐపీఎల్ 2025లో సీఎస్కే ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అనేక రికార్డులు తిరగరాసింది. ఖలీల్ అహ్మద్, రొమారియో షెపర్డ్, విరాట్ కొహ్లీ కొత్త చరిత్ర రాశారు.

IPL 2025: IPL 2025లో ఖలీల్ అహ్మద్ అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్‌గా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. RCBతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 33 పరుగులు ఇచ్చాడు. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మూడో అత్యంత ఖరీదైన ఓవర్. అహ్మద్ ఓవర్‌లో RCBకి చెందిన రోమారియో షెఫర్డ్ 4 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టి మొత్తం 33 పరుగులు చేశాడు. ఈ ఖరీదైన ఓవర్ వల్ల CSKతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఖలీల్ అహ్మద్ CSK తరపున 19వ ఓవర్ వేశాడు. రోమారియో షెఫర్డ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మొదటి 4 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి 22 పరుగులు చేశాడు. ఐదవ బంతి నో-బాల్ అయింది, దానిని కూడా షెఫర్డ్ సిక్స్ కొట్టాడు. ఓవర్ చివరి బంతి ఫోర్ కొట్టాడు. ఈ దూకుడుతో ఓవర్‌లో మొత్తం 33 పరుగులు రాబట్టాడు. గతంలో ఈ రికార్డు పర్వీందర్ అవానా పేరు మీద ఉంది. అతను కూడా IPLలో ఒక ఓవర్‌లో 33 పరుగులు ఇచ్చాడు. IPLలో అత్యంత ఎక్కువ పరుగులు ఇచ్చిన ఓవర్‌ను పి. పరమేశ్వరన్ వేశాడు. కోచి టస్కర్స్ కేరళ తరపున ఆడుతూ RCBతో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగులు ఇచ్చాడు.
CSKకు అత్యంత ఖరీదైన ఓవర్
ఖలీల్ అహ్మద్ ఇప్పుడు IPL చరిత్రలో CSK తరపున ఆడుతూ అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్ అయ్యాడు. సీఎస్కే తరఫున ఈ రికార్డు ఎంగిడి పేరు మీద ఉంది. ఆయన 2020లో ఒకే ఓవర్‌లో 30 పరుగులు ఇచ్చాడు. సామ్ కర్రన్ కూడా 2021లో KKRతో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగులు ఇచ్చాడు.
వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన రొమారియో షెఫర్డ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన రొమారియో షెఫర్డ్ ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు ఈ IPL సీజన్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు మీద ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌పై రొమారియో షెఫర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో CSK, RCB మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. RCB జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. జాకబ్ , విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత బెంగళూరు బ్యాటింగ్ కాస్త తడబడింది. కానీ ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో రొమారియో షెపర్డ్ బెంగళూరు గేమ్‌ను మార్చేశాడు.
రొమారియో షెఫర్డ్ విధ్వంసం
చెన్నై సూపర్ కింగ్స్ తరపున మతిషా పతిరానా వేసిన 20వ ఓవర్ లో మొదటి బంతికి టిమ్ డేవిడ్ ఒక పరుగు తీసి రొమారియోకు స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో పతిరానా ఓవర్‌లో కూడా 21 పరుగులు రాబట్టాడు. ఇందులో 2 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఆఖరి ఓవర్ చివరి బంతికి రొమారియో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో షెపర్డ్ 14 బంతుల్లో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు, అతను 6 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్ స్ట్రైక్ రేట్ 378.57.
RCB విధ్వంసం
RCB 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 200 పరుగుల స్కోర్ చేరుకోలేదని చాలామంది అనుకున్నారు. కానీ RCB బ్యాట్స్‌మన్లు చివరి 2 ఓవర్లలో 54 పరుగులు చేశారు. ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో 33 పరుగులు వచ్చాయి, అలాగే చివరి ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి.




















