Jos Buttler: బట్లర్ నువ్వు బాదుతూనే ఉండు! మేం డబ్బులిస్తూనే ఉంటాం!!
Jos Buttler: ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ జాక్‌పాట్ కొట్టేశాడు! రాజస్థాన్ రాయల్స్ అతడికి ఊరించే ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
Jos Buttler, IPL:
ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler) జాక్‌పాట్ కొట్టేశాడు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ అతడికి ఊరించే ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. వివిధ లీగుల్లో తమ ఫ్రాంచైజీకే నాలుగైదేళ్లు ఆడేందుకు భారీ మొత్తం ఇస్తున్నట్టు తెలిసింది. బ్రిటిష్ వార్తా పత్రిక 'టెలిగ్రాఫ్' ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది.
టీ20 లీగులు రావడంతో అంతర్జాతీయ క్రికెట్ స్వరూపం మారిపోతోంది. ఒకప్పడు ఆటగాళ్లకు బోర్డులు సెంట్రల్ కాంట్రాక్టులు ఇచ్చేవి. ప్రస్తుతం టీ20 ఫ్రాంచైజీలు వివిధ దేశాల్లోని లీగుల్లో జట్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకోసం ప్రధాన ఆటగాళ్లను ఎంచుకొని భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అంటే ఐపీఎల్, సీపీఎల్, ఎస్‌ఏటీ20, టీ10 వంటి లీగుల్లో తమ జట్టుకే ఆడేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటికే చాలామందికి ఇలాంటి ఆఫర్లు వెళ్లాయి.
ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్‌కు సుదీర్ఘ కాలానికి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు తెలిసింది. అయితే అధికారికంగా ఈ డీల్ ఇంకా పూర్తవ్వలేదు. బట్లర్ సైతం ఇందుకు అంగీకరిస్తాడో లేదో తెలియదు. 'ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ నాలుగేళ్ల కాలానికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది' అని టెలిగ్రాఫ్ తెలిపింది. 'ఈ ఒప్పందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. టీ20 ప్రపంచకప్ గెలిపించిన బట్లర్ ఇందుకు అంగీకరిస్తాడో లేదో స్పష్టత లేదు' అని వెల్లడించింది. మొత్తానికి ఒప్పందం విలువ కోట్ల రూపాయాల్లో ఉంటుందని సమాచారం.
కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగులో జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రతి సీజన్లో కనీసం 400 పరుగులు చేస్తున్నాడు. 2018 నుంచి 71 మ్యాచుల్లో ఐదు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు బాదేశాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ సంఘం మొదలుపెట్టిన ఎస్‌ఏ20లో పార్ల్ రాయల్స్‌కు బట్లర్ ఆడాడు. ఇది రాజస్థాన్ రాయల్స్ జట్టే. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ వారికి బార్బడోస్ రాయల్స్ అనే టీమ్ ఉంది.
ఫ్రాంచైజీలు క్రికెటర్లకు ఇలాంటి సుదీర్ఘ కాలపు ఆఫర్లు ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఇలాంటి ఒప్పందం చేసుకున్నాడు. అందుకే న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్టును వదిలేశాడు.
ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కూ ముంబయి ఇండియన్స్ ఇలాంటి ఆఫరే ఇచ్చింది. ప్రస్తుతం క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడాలంటే దేశపు క్రికెట్ బోర్డులు అనుమతి ఇవ్వాలి. ఒకవేళ ఆటగాళ్లే ఫ్రాంచైజీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే భవిష్యత్తులో దేశపు బోర్డులే తమ తరఫున ఆడేందుకు అనుమతి కోరాల్సి రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్ లేకపోవడంతో న్యూజిలాండ్ పరిస్థితి ఇలాగే మారింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
This one's for the soul. 😂💗 pic.twitter.com/qf2eoKYVHB
— Rajasthan Royals (@rajasthanroyals) June 29, 2023