IPL 2024: ఐపీఎల్ సమీపిస్తున్న వేళ, చెన్నై స్టార్ పేసర్ దూరం
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ మతీశా పతిరణ గాయం కారణంగా దాదాపు నాలుగైదు వారాలపాటు మైదానానికి దూరం కానున్నాడు.
Matheesha Pathirana injured, Mustafizur Rahman may have to step up for Chennai Super Kings: మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభం కానుంది. ఈసారి అన్ని జట్లు ఎలాగైనా కప్పు గెలుచుకోవాలని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాయి. కానీ చాలా జట్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమవ్వగా... ఇప్పుడు చెన్నైకు చెందిన మరో స్టార్ ఆటగాడు కూడా దూరమయ్యాడు.
షాక్ మీద షాక్
చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ మతీశా పతిరణ(Matheesha Pathirana) గాయం కారణంగా దాదాపు నాలుగైదు వారాలపాటు మైదానానికి దూరం కానున్నాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు పతిరణ అందుబాటులో ఉండటం కష్టమేనని చెన్నై స్పష్టం చేసింది. ఇప్పుడు గాయం తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటంతో మరికొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. మార్చి 6న బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. . ఈ సీజన్‌లో చెన్నైసూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 22న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. అప్పటివరకు పతిరణ కోలుకోవడం కష్టమే కాబట్టి ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు ఉన్న పతిరణ గతేడాది 12 మ్యాచ్‌లాడి 19 వికెట్లు తీశాడు. పతిరణ జట్టుకు దూరమైతే అతని స్థానంలో బంగ్లాదేష్ సీనియర్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్( Mustafizur Rahman)ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన డేవాన్ కాన్వే కూడా బొటన వేలి శస్త్ర చికిత్స కారణంగా ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
కీలక ఆటగాళ్లకు గాయాలు
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగిడీ(Lungi Ngidi)ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా లీగ్‌కు అందుబాటులో ఉండటం లేదని ఎంగిడీ ప్రకటించాడు. ఎంగిడీ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్ జేక్‌ప్రేజర్ మెక్ గుర్క్(McGurk) ను ఢిల్లీ జట్టులోకి తీసుకుంది. మెల్‌బోర్న్‌కు చెందిన మెక్‌గుర్క్ హార్డ్‌హిట్టింగ్ ఓపెనింగ్ బ్యాటర్‌తో పాటు లెగ్‌స్పిన్నర్. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్‌ప్రారంభమవుతున్న వేళ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్(IPL) ప్రారంభానికి ముంబై ఇండియన్స్(MI)కు గట్టి షాక్ తగిలినట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్, విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయానికి సూర్య జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో సూర్యా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే సూర్య ఇంకా పూర్తిగా కోలుకోలేదని... అతను ఐపీఎల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి.