IPL 2024: ఢిల్లీ కీలక నిర్ణయం , జట్టులోకి కొత్త ఆటగాడు
Delhi Capitals: వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమైన ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్‌ను జట్టులోకి తీసుకుంది.

Lizaad Williams as replacement for Harry Brook: ఐపీఎల్ 2024(IPL 2024)లో ఢిల్లీ(DC)ని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. ఇప్పటివరకు అయిదు మ్యాచులు ఆడిన ఢిల్లీ(DC)... ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఢిల్లీ 29 పరుగుల తేడాతో ఓడింది. వరుస ఓటముల నేపథ్యంలో ఢిల్లీ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమైన ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ లిజాడ్ విలియమ్స్‌ను జట్టులోకి తీసుకుంది. లిజాడ్ విలియమ్స్‌ను కనీస బేస్ ధర రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. లిజాడ్ విలియమ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ట్టులో చేర్చుకున్న విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. ‘టాటా ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌లకు ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్ లిజాడ్ విలియమ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులోకి చేర్చుకుందని ప్రకటించింది. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విలియమ్స్ సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు రెండు టెస్టులు, నాలుగు వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ముంబైపైనా ఢిల్లీ ఓటమి
ఈ ఐపీఎల్(IPL) సీజన్‌లో.. అయిదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్(MI) తొలి విజయం నమోదు చేసింది. తొలుత ముంబై బ్యాటర్లు జూలు విదల్చగా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరి ఓవర్‌లో ముంబై బ్యాటర్ రొమారియో షెఫర్డ్ ఏకంగా 32 పరుగులు రాబట్టి హార్దిక్ సేనకు భారీ స్కోరు అందించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ... నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితమైంది. పృథ్వీ షా, స్టబ్స్ రాణించినా.. ఢిల్లీకి ఓటమి తప్పలేదు. రోహిత్ (49), ఇషాన్ (42) మంచి ఆరంభాన్ని అందించారు. చివర్లో టిమ్ డేవిడ్ (45నాటౌట్), షెఫర్డ్ (39నాటౌట్) రాణించడంతో ముంబై స్కోర్ 234 కు చేరింది. 235 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో పృథ్వీ (66), స్టబ్స్ (77) ఆఫ్ సెంచరీలు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయారు.
అరుదైన రికార్డు
ముంబై హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. హోం గ్రౌండ్ లో ముంబై జట్టు ప్రపంచ రికార్డును సృష్టించింది. టీ20 క్రికెట్ లో 150 మ్యాచ్ లు గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబై తరువాత ఆ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉంది. ఆ జట్టు మొత్తం 148 మ్యాచ్ లను గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు టీ20 క్రికెట్ లో హాఫ్ సెంచరీ లేకుండానే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది.




















