RR vs PBKS: కింగ్స్‌పై సంజూ సేనదే అప్పర్ హ్యాండ్! గబ్బర్ ట్రెండ్ మారుస్తాడా!
RR vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగులో బుధవారం ఎనిమిదో మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి.
RR vs PBKS, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగులో బుధవారం ఎనిమిదో మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. గువాహటీ ఇందుకు వేదిక. సాయంత్రం 7:30 మ్యాచ్ మొదలవుతుంది. తొలి విజయాలు అందుకు ఈ రెండు జట్లు రెండో గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్నాయి.
రాయల్స్ .. జోష్!
సీజన్ ఆరంభ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. సన్‌రైజర్స్ మ్యాచులో 200+ స్కోరు చేసింది. ఆటగాళ్లంతా భీకరమైన ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్ టోర్నీకే ఊపు తెచ్చారు. కెప్టెన్ సంజూ శాంసన్ క్లాస్ ప్లస్ మాస్ బ్యాటింగ్‌తో అలరించాడు. ఉప్పల్ స్టేడియంలో వీరు కొట్టిన సిక్సర్లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హెట్‌మైయిర్, దేవదత్ పడిక్కల్, జేసన్ హోల్డర్, రియాన్ పరాగ్, అక్షత్ వశిష్టతో కూడిన మిడిలార్డర్ ఊచకోత కోయగలదు. ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, కేఎం ఆసిఫ్, హోల్డర్, పరాగ్, సందీప్ శర్మతో కూడిన బౌలింగ్ డిపార్ట్‌మెంటుకు తిరుగులేదు. నవదీప్ సైనీ ప్లేస్‌లో సందీప్ శర్మకు ఛాన్స్ రావొచ్చు.
కింగ్స్.. అదుర్స్!
గబ్బర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచులో అదుర్స్ అనిపించింది. కోల్‌కతాపై మెరుపు బ్యాటింగ్‌తో దాడి చేసింది. ఓపెనర్లు ప్రభుసిమ్రన్, శిఖర్ ధావన్ దంచికొట్టారు. లంకేయుడు భానుక రాజపక్స అరాచక బ్యాటింగ్ చేశాడు. జితేశ్, సికిందర్ రజా, సామ్ కరణ్, షారుఖ్ ఖాన్ అందరూ మంచి టచ్‌లో ఉన్నారు. లియామ్ లివింగ్ స్టోన్ తిరిగొస్తే పంజాబ్ మరింత డేంజరస్‌గా మారుతుంది. బౌలింగ్ వనరులూ బాగానే ఉన్నాయి. అర్షదీప్ ఎప్పట్లాగే అటాక్ చేశాడు. నేథన్ ఎలిస్, రాహుల్ చాహర్, సికిందర్ రజా బౌలింగ్ ఫర్వాలేదు. సామ్ కరణ్, రిషి ధావన్ బౌలింగ్ మరింత మెరుగవ్వాలి.
సంజూ సేనదే పైచేయి
పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌దే డామినేషన్! చివరి ఐదు మ్యాచుల్లో సంజూ సేన నాలుగు గెలిచింది. మూడు సార్లు బంతులు మిగిలుండగానే ఛేదించేసింది. పంజాబ్ ఒక్కసారే గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 24 సార్లు తలపడ్డాయి. రాజస్థాన్ 14-9తో కింగ్స్‌పై ఆధిపత్యం చెలాయిస్తోంది.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), భానుకా రాజపక్స, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు (అంచనా)
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్