IPL 2023 Play off Scenarios: ప్లేఆఫ్ బెర్తులు 3 కాంపిటీటర్లు 7 - ఎవ్వరూ సేఫ్ కాదు!
IPL 2023 Play off Scenarios: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఆఖరి అంకానికి చేరుకుంది. మూడు జట్లు ప్లేఆఫ్ బెర్త్‌ల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. అవేంటంటే?
IPL 2023 Play off Scenarios:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఆఖరి అంకానికి చేరుకుంది. లీగ్ దశ ముగిసేందుకు మరో నాలుగు రోజులు మిగిలింది! ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్ చేరుకుంది. దాన్ని బీట్ చేసే జట్టు మరేమీ లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేట్ అయ్యాయి. ఇక మిగిలిన మూడు ప్లేఆఫ్ బెర్త్‌ల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. అవేంటంటే?
లక్నో సూపర్ జెయింట్స్: ప్రస్తుతం ఈ జట్టు 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ముంబయిపై థ్రిల్లింగ్ విక్టరీతో ప్లేఆఫ్ బెర్త్‌కు మరింత చేరువైంది. కృనాల్ సేనకు ఇక మరో మ్యాచ్ మాత్రమే మిగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడాల్సి ఉంది. అందులో గెలిస్తే 17 పాయింట్లతో టాప్-2 లేదా 3లో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే గుజరాత్, చెన్నై, ముంబయి, ఆర్సీబీ, పంజాబ్ గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆర్సీబీ, పంజాబ్ ఒక్కో మ్యాచ్ ఓడితే ఇక ఫికర్ లేదు.
ముంబయి ఇండియన్స్: ఐదు సార్లు ఛాంపియన్ ముంబయి 14 పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో ఉంది. లక్నో చేతిలో ఓటమితో ఆఖరి మ్యాచులో తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఆదివారం సన్‌రైజర్స్‌తో తలపడనుంది. అందులో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. ఇక పంజాబ్, ఆర్సీబీ 16 పాయింట్లకు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా మెరుగైన రన్‌రేట్ సాధిస్తే ప్లేఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ ఓడితే ఐదు జట్లతో అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది.
పంజాబ్ కింగ్స్: 12 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. దిల్లీక్యాపిటల్స్, రాజస్థాన్ తలపడాల్సి ఉంటుంది. రన్‌రేట్ బాగాలేకపోవడంతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవడం కష్టం. ఆఖరి రెండింట్లో గెలిస్తేనే ప్లేఆఫ్ అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్సీబీ గెలవకుండా, రన్‌రేట్ మెరుగుపర్చుకోకుండా ఉండాలి. ఒకవేళ ఒక్క మ్యాచ్ ఓడినా ఇక పనైపోయినట్టే!
చెన్నై సూపర్ కింగ్స్: ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడింది. 15 పాయింట్లు, 0.381 నెట్‌రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉంది. లక్నో చేతిలో మంబయి ఓడిపోవడం ఆ జట్టుకు మేలు చేసింది. టాప్-2లో నిలిచే అవకాశం అందించింది. ఒకవేళ చివరి మ్యాచులో 10 తేడాతో గెలిస్తే.. లక్నో 29 తేడాతో విజయం అందుకోకూడదు. అలా జరిగితే కృనాల్ సేన రెండో ప్లేస్‌కు వెళ్తుంది. ఒకవేళ దిల్లీ చేతుల్లో ఓడిందంటే సీఎస్కే బయటకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఐదు జట్లు 15 పాయింట్లకు మించే ఫినిష్ చేసే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 12 మ్యాచులు ఆడింది. 0.166 రన్‌రేట్, 12 పాయింట్లతో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్ చేరుకోవడం పక్కా! మెరుగైన రన్‌రేట్ ఉండటమే కారణం. ఒక హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఉండటం వీరి అదృష్టం. అయితే ఏ ఒక్క మ్యాచులో ఓడినా ఆర్సీబీ ఇంటికి వెళ్లాల్సిందే.
రాజస్థాన్ రాయల్స్: టాప్ పొజిషన్లో ఉండాల్సిన సంజూ సేన ప్రస్తుతం 13 మ్యాచులాడి 12 పాయింట్లతో ఉంది. నెట్ రన్‌రేట్ 0.140. ఆర్సీబీ చేతిలో దారుణ పరాభవం ప్లేఆఫ్ ఆశల్ని చిదిమేసింది. ఆఖరి మ్యాచులో పంజాబ్ కింగ్స్‌ను తప్పకుండా ఓడించాలి. అలాగే ఆర్సీబీ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవాలని కోరుకోవాలి.
కోల్‌కతా నైట్‌రైడర్స్: ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడింది. 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. రన్‌రేట్ -0.256. కేకేఆర్ ప్లేఆఫ్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఆఖరి మ్యాచులో లక్నోపై ఘన విజయం సాధించాలి. ఇక ఆర్సీబీ, పంజాబ్ రెండు మ్యాచుల్లోనూ ఓడిపోవాలి. ఒక మ్యాచులో ఓడినా రన్‌రేట్ పేలవంగా ఉండాలి. ముంబయి కూడా ఓడిపోవాలి. ఇదంత సులభం కాదు.