IPL 2023 GT vs CSK: ధోనీ ముందు 'కుంగ్‌ఫూ' ఆటలా! బట్.. పాండ్య టీమే బాగుంది!
GT vs CSK Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగులో నేడు తొలి మ్యాచ్ జరుగుతోంది. మొతేరా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. మరి వీరిలో విజేత ఎవరు?
GT vs CSK Match Preview:
ఇండియన్ ప్రీమియర్ లీగులో నేడు తొలి మ్యాచ్ జరుగుతోంది. మొతేరా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. హర్దిక్ నేతృతంలోని జీటీ బలంగా కనిపిస్తోంది. గాయపడ్డ ఆటగాళ్లతో సీఎస్‌కే ఇబ్బంది పడుతోంది. మరి వీరిలో విజేత ఎవరు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఎవరు ఉండొచ్చు?
సూపర్ జీటీ!
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మునుపటి కన్నా మరింత బలంగా మారింది. పేస్ బౌలింగ్ యూనిట్, మిడిలార్డర్‌ను పటిష్ఠంగా మార్చుకుంది. గతేడాది యాంకర్ ఇన్నింగ్స్‌లతో మురిపించిన డేవిడ్ మిల్లర్ తొలి మ్యాచుకు అందుబాటులో ఉండటం లేదు. దాంతో రాహుల్ తెవాతియా అతడి పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేన్ విలియమ్సన్ రావడంతో హార్దిక్ పాండ్య తనకు నచ్చిన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వృద్ధిమాన్ సాహా ఓపెనింగ్‌కు వస్తాడు. రషీద్ ఖాన్ పీఎస్‌లో అదరగొట్టాడు. అల్జారీ జోసెఫ్, జోష్ లిటిల్, శివమ్ మావి రావడంతో పేస్ ఆప్షన్లు పెరిగాయి. షమి, హార్దిక్‌పై భారం తగ్గుతుంది. సాయి కిషోర్, జయంత్ యాదవ్, రషీద్ స్పిన్ చూస్తారు.
గాయాల సీఎస్‌కే!
చివరి సీజన్లో ఘోరంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈసారీ కష్టాలు తప్పేలా లేవు. సొంత మైదానం చెపాక్‌ను దృష్టిలో పెట్టుకొని హెవీ స్పిన్ అటాక్‌ను రూపొందించుకుంది. అయితే తొలి ఏడు మ్యాచుల్లో ఐదు బయటే ఆడుతుండటం వీక్ పాయింట్. పైగా చాలామంది ఆటగాళ్లు గాయపడ్డారు. ఇంకొందరు అందుబాటులో ఉండటం లేదు. న్యూజిలాండ్ సిరీసు వల్ల మహీశ్ థీక్షణ, మతీశ పతిరన లేటుగా వస్తారు. అయితే డేవాన్ కాన్వే, మిచెల్ శాంట్నర్ ముందుగానే వస్తుండటం ప్లస్ పాయింట్. లెఫ్టార్మ్ సీమర్ ముకేశ్ మొత్తం సీజన్‌కే దూరమవ్వడం కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికా పేసర్ సిసంద మగల కూడా కొన్ని మ్యాచులకు రాడు. స్టోక్స్ బంతి పట్టడు. రుతురాజ్, జడ్డూ, రాయుడు, ధోనీపై భారం తప్పదు. ధోనీ సైతం గాయపడ్డాడనే సమాచారం.
తుది జట్లు (GT vs CSK Playing XI)
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, శివమ్ మావి, జయంత్ యాదవ్ / సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమి. మ్యాచ్ పరిస్థితులను బట్టి అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉపయోగించుకోవచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్: రుతరాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ మావి, రాజ్‌వర్దన్ హంగర్‌గేకర్, ఎంఎస్ ధోనీ, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, సిమ్రన్‌జీత్ సింగ్ / తషార్ దేశ్‌పాండే. మొదట బ్యాటింగ్, బౌలింగ్ చేయడాన్ని బట్టి అజింక్య రహానె, షేక్ రషీద్, రాజ్‌వర్దన్, అంబటి రాయుడుని ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకోవచ్చు.
పిచ్ ఎలా ఉంటుందంటే?
మొతేరాలో ఆరు ఎర్రమట్టి, ఐదు నల్లమట్టి పిచ్‌లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇందులో ఏ పిచ్ ఉపయోగిస్తుందో తెలియదు. గతేడాది ఐపీఎల్‌కు సీమర్లకు అనుకూలించే పిచ్ వాడారు. బహుశా ఇప్పుడూ అదే వాడొచ్చు. బౌన్స్ అయ్యే పిచ్‌పై జీటీని ఎదుర్కోవడం ఈజీగా కాదు. ఆకాశం నిర్మలంగానే ఉంటుంది. గాల్లో ఎలాంటి తేమ ఉండదు.