Akash Madhwal: ఆకాశ్ అదుర్స్ - ఫైఫర్‌తో రికార్డుల దుమ్ము దులిపిన మధ్వాల్
ఐపీఎల్-16 లో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆకాశ్ మధ్వాల్ ఆకట్టుకున్నాడు.
IPL 2023, LSG vs MI: ముంబై ఇండియన్స్ యువ సంచలనం ఆకాశ్ మధ్వాల్ సంచలన స్పెల్‌తో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో సీజన్‌లో కూడా ఎలిమినేటర్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా లక్నో - ముంబై మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మధ్వాల్.. 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగడమే గాక రికార్డుల దుమ్ము దులిపాడు.
కుంబ్లే రికార్డు సమం..
ఐపీఎల్ రెండో సీజన్ (2009)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ అనిల్ కుంబ్లే.. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ రికార్డును మధ్వాల్ సమం చేశాడు. లక్నోతో మ్యాచ్‌లో కూడా మధ్వాల్.. ఐదు పరుగులే ఇచ్చి ఫైపర్ నమోదుచేయడం గమనార్హం.
ముంబై ఇండియన్స్‌కు..
ముంబై ఇండియన్స్ తరఫున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదుచేసిన ఆటగాడిగా మధ్వాల్ నిలిచాడు. ఇంతకుముందు లసిత్ మలింగ.. 2013లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇప్పటిదాకా ఇదే అత్యుత్తమం. కానీ నిన్నటి లక్నో మ్యాచ్ తో మధ్వాల్ ఈ రికార్డును అధిగమించాడు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా..
ఐపీఎల్‌లో అన్ క్యాప్డ్ ప్లేయర్ (ఏదైనా జాతీయ జట్టుకు ఆడని ఆటగాడిని ఇలా పిలుస్తారు)గా ఉండి అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా మధ్వాల్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు ఆటగాడు అంకిత్ రాజ్‌పుత్.. సన్ రైజర్స్ పై 2018లో 5 వికెట్లు తీసి 14 పరుగులిచ్చాడు. ఇప్పుడు ఈ రికార్డును మధ్వాల్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వరుణ్ చక్రవర్తి (5-20), ఉమ్రాన్ మాలిక్ (5-25) కూడా ఉన్నారు.
ప్లేఆఫ్స్‌లో..
ప్లేఆఫ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన మధ్వాల్ పేరిటే ఉంది. గతంలో సీఎస్కే తరఫున 2010లో బొలింగర్.. డెక్కన్ ఛార్జర్స్ పై13 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ప్రదర్శనే అత్యుత్తమం. ఆ తర్వాత 2020 క్వాలిఫయర్ 1 లో బుమ్రా.. 4-14 గణాంకాలు నమోదు చేశాడు. ఈ రెండు రికార్డులనూ మధ్వాల్ బ్రేక్ చేశాడు. అలాగే ఐదు వికెట్లు తీసి మోస్ట్ ఎకనామికల్ స్పెల్ గా కూడా అనిల్ కుంబ్లే (5-5, ఎకానమీ రేట్-1.57), బుమ్రా (5-10, ఎ.రే - 2.50) రికార్డులను బ్రేక్ చేశాడు. నిన్నటి మ్యాచ్ లో మధ్వాల్ ఎకానమీ రేట్.. 1.4గా నమోదైంది.
ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన..
- అల్జారీ జోసెఫ్ (ముంబై) 2019లో హైదరాబాద్ పై 6-12
- సోహైల్ తన్వీర్ (రాజస్తాన్) 2008లో చెన్నైపై 6-14
- ఆడమ్ జంపా (రాజస్తాన్) 2016 లో హైదరాబాద్ పై 6-19
- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ) 2009లో రాజస్తాన్ పై 5 - 5
- ఆకాశ్ మధ్వాల్ (ముంబై) 2023లో లక్నో పై 5- 5
లక్నో - ముంబై మ్యాచ్‌లో మధ్వాల్.. తన మొదటి ఓవర్‌లోనే ప్రేరక్ మన్కడ్‌ను ఔట్ చేశాడు. ఇక పదో ఓవర్లో అయుష్ బదోని, నికోలస్ పూరన్ లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. చివర్లో రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్ లనూ ఔట్ చేసి ముంబైకి సూపర్ డూపర్ విక్టరీని అందించాడు. మధ్వాల్ విజృంభణతో ముంబై నిర్దేశించిన 183 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్‌లో లక్నోపై ముంబైకి ఇదే ఫస్ట్ విక్టరీ కావడం గమనార్హం.