Chahal IPL Experience: ఓ మై గాడ్! ఫుల్లుగా తాగేసి చాహల్‌ను 15వ ఫ్లోర్ నుంచి వేలాడదీసిన సీనియర్ క్రికెటర్!
Chahal IPL Experience: కొందరు సీనియర్ క్రికెటర్ల పైశాచికత్వాన్ని యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) బయటపెట్టాడు. ముంబయి ఇండియన్స్‌లో (Mumbai Indians) తనకు జరిగిన అవమానాలను వివరించాడు.
IPL 2022 Yuzvendra Chahal reveals ipl experience 2013 drunk teammate dangled off 15th floor balcony Watch Video : కొందరు సీనియర్ క్రికెటర్ల పైశాచికత్వాన్ని క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) బయటపెట్టాడు. ముంబయి ఇండియన్స్‌లో (Mumbai Indians) యువ క్రికెటర్‌గా ఉన్నప్పుడు తనకు జరిగిన అవమానాలను వివరించాడు. విదేశీ క్రికెటర్లు ఎంత హీనంగా ప్రవర్తించేవారో వెల్లడించాడు. ప్రస్తుతం యూజీ రాజస్థాన్ రాయల్స్‌కు (Rajasthan Royals) ఆడుతున్నాడు. అదే జట్టుకు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ (Ravi chandran Ashwin) చేసిన ఇంటర్వ్యూలో భయంకరమైన నిజాలు బయటపెట్టాడు.
యుజ్వేంద్ర చాహల్ మొదట ముంబయి ఇండియన్స్‌కే ఆడాడు. 2013లో అతడిని ఓ క్రికెటర్ బాగా తాగి 15వ అంతస్తు నుంచి వేలాడదీశాడని యూజీ చెప్పాడు. 'ఇది 2013లో జరిగింది. బెంగళూరులో మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. అప్పుడు ఆటగాళ్లంతా బాగా మద్యం తాగేశారు. ఒక క్రికెటర్ నన్ను పిలిచాడు. అతడి పేరు చెప్పను. అతడు నన్ను బయటకు తీసుకెళ్లి బాల్కనీ నుంచి వేలాడదీశాడు. నేను అతడి మెడ చుట్టూ నా చేతులతో బిగ్గరగా పట్టుకున్నాను. నా గ్రిప్పు వదిలేసుంటే 15వ ఫ్లోర్ నుంచి పడిపోయేవాడిని' అని యూజీ చెప్పాడు.
'అదే సమయంలో కొందరు బాల్కనీకి వచ్చి నన్ను విడిపించారు. భయంతో బిగుసుకుపోయిన నాకు నీళ్లు ఇచ్చారు. ఇతరులతో బయటకు వెళ్లినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అప్పుడే నాకర్థమైంది. నిజం చెప్పాలంటే నేను కొద్దిలో ప్రమాదం తప్పించుకున్నాను. చిన్న పొరపాటు జరిగినా కింద పడిపోయేవాడిని' అని యూజీ వెల్లడించాడు. 2011లో జరిగిన మరో సంఘటననూ అతడు వివరించాడు.
'ఇది 2011లో జరిగింది. ముంబయి ఇండియన్స్ చెన్నైలో ఛాంపియన్స్ లీగ్ నెగ్గింది. అప్పుడు ఆండ్రూ సైమండ్స్ (Andrew Symonds), జేమ్స్ ఫ్రాంక్లిన్ (James Franklin) బాగా తాగారు. నా దగ్గరికి వచ్చారు. నా కాళ్లూ చేతులూ కట్టేశారు. నోటికి టేపు అతికించి ఓ మూలన పడేశారు. పార్టీలో పడి నన్ను మర్చిపోయి వదిలి వెళ్లిపోయారు. తెల్లారేవరకు నేనదే గదిలో ఉండిపోయాను. ఉదయాన్నే క్లీన్ చేసేవాళ్లు వచ్చి నన్ను చూసి కట్లు విప్పారు. ఎప్పట్నుంచి ఇలా ఉన్నావని అడిగితే రాత్రంతా అని చెప్పాను' అని యూజీ అన్నాడు.
మరి సైమండ్స్, ఫ్రాంక్లిన్ క్షమాపణ చెప్పారా అని యాష్ ప్రశ్నించగా 'లేదు. రాత్రి ఎక్కువ జ్యూస్ (మద్యం) తాగితే తెల్లారి ఏమీ గుర్తుండదు కదా అని వాళ్లు నవ్వేశారు' అని యూజీ వివరించాడు. ఒకప్పడు తనకు జరిగిన అవమానాల గురించి పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 31 ఏళ్లు. ఈ విషయం బయటకు రావడంతో ముంబయి ఇండియన్స్ అసలు ఏం చర్యలు తీసుకుందని వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు.
Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV
— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022