IPL 2022, PBKS vs SRH: మనల్ని ఎవరు ఆపేది - రైజర్స్‌కు వరుసగా నాలుగో విజయం - ఈసారి తొక్కింది పంజాబ్‌ని!
PBKS vs SRH, Match Highlights: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం సాయంత్రం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌట్ కాగా... సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానానికి ఎగబాకింది.
స్లాగ్ ఓవర్లలో చెలరేగిన రైజర్స్ బౌలర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు వారు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (8: 11 బంతుల్లో, ఒక ఫోర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (14: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం అయ్యారు. దీంతో పంజాబ్ పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లోనే జానీ బెయిర్‌స్టో (12: 10 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుటయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ (11: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.
ఈ దశలో ఫాంలో ఉన్న లియాం లివింగ్‌స్టోన్ (60: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), షారుక్ ఖాన్ (26: 28 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) పంజాబ్‌ను ఆదుకున్నారు. షారుక్ ఖాన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డా... మరో ఎండ్‌లో లియాం లివింగ్‌స్టోన్ బౌండరీలతో చెలరేగాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ టచ్‌లో ఉండటం, షారుక్ కూడా బౌండరీలు కొడుతూ ఉండటంతో పంజాబ్ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపించింది.
అయితే చివరి నాలుగు ఓవర్లలో సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగారు. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టారు. రెండు బౌండరీలు మాత్రమే వచ్చాయి. ఉమ్రాన్ మలిక్ వేసిన చివరి ఓవర్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా నాలుగు వికెట్లు తీశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మలిక్ నాలుగు వికెట్లు తీయగా... భువీకి మూడు వికెట్లు దక్కాయి. నటరాజన్, జగదీష సుచిత్ చెరో వికెట్ తీశారు.
మార్క్రమ్, పూరన్ కొట్టేశారు...
152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఎప్పటిలానే ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న కేన్ విలియమ్సన్ (3: 9 బంతుల్లో) మళ్లీ విఫలం అయ్యాడు. దీంతో రాహుల్ త్రిపాఠి (34: 22 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (31: 25 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించి రైజర్స్‌ను ఒత్తిడి నుంచి బయటపడేశారు.
అయితే రాహుల్ చాహర్ తన వరుస ఓవర్లలో వీరిద్దరినీ అవుట్ చేసి పంజాబ్ జట్టులో ఆశలు పెంచాడు. కానీ ఫాంలో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ (41 నాటౌట్: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), నికోలస్ పూరన్ (35 నాటౌట్: 30బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) పంజాబ్‌కు మరో అవకాశం ఇవ్వలేదు. కొట్టాల్సిన స్కోరు తక్కువే కావడంతో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఆడారు. క్రమం తప్పకుండా సింగిల్స్ తీస్తూ... అప్పుడప్పుడూ బౌండరీలు కొడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూశారు. అభేద్యమైన నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 75 పరుగులు జోడించారు. దీంతో సన్‌రైజర్స్ 18.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
View this post on Instagram