IPL 2022: రోహిత్ మళ్లీ ఆ తప్పు చేశాడంటే నిషేధం తప్పదు - ఐపీఎల్ కమిటీ హెచ్చరిక
IPL 2022: ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. స్లో ఓవర్‌రేట్ కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.24 లక్షలు జరిమానా విధించారు.
IPL 2022, Rohit sharma fined for slow over rate: ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే వరుసగా ఐదు ఓటములతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.24 లక్షలు జరిమానా విధించారు. మరోసారి ఇదే పొరపాటు రిపీటైందంటే ఒక మ్యాచు నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ముంబై ఇండియన్స్‌కు వరుసగా ఐదో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 186 పరుగులకే పరిమితం అయింది.
ఈ మ్యాచులో పంజాబ్ ఉతికారేయడంతో ముంబయి బౌలింగ్ నెమ్మదిగా సాగింది. స్లో ఓవర్‌రేట్ నమోదైంది. దాంతో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు రిఫరీ రూ.24 లక్షల జరిమానా విధించారు. అంతకు ముందు దిల్లీ మ్యాచులోనూ స్లో ఓవర్‌రేట్ వల్ల హిట్‌మ్యాన్ రూ.12 లక్షల ఫైన్ కట్టాల్సి వచ్చింది. మరోసారి సీజన్లో ఇదే తప్పు జరిగితే అతడు ఏకంగా రూ.30 లక్షలు చెల్లించడమే కాకుండా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు.
'ఐపీఎల్ 2022 నియమావళి ప్రకారం ముంబయి ఇండియన్స్ స్లో ఓవర్‌రేట్ తప్పు చేయడం ఇది రెండోసారి. దాంతో కెప్టెన్ రోహిత్ శర్మకు రూ.24 లక్షలు, తుది జట్టులోని ప్రతి ఒక్కరికీ రూ.6 లక్షలు లేదా 25 శాతం మ్యాచ్ ఫీజులో ఏది తక్కువైతే అది కోత విధిస్తున్నాం' అని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
ముంబయి ఓటముల పట్ల రోహిత్ శర్మ నిరాశ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వెంటనే తాము డ్రాయింగ్ రూమ్‌నకు వెళ్లి వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు. 'మేం నాణ్యమైన క్రికెట్ ఆడటం లేదు. మేం కొన్ని పరిస్థితులను అర్థం చేసుకోవాలి. వాటి ప్రకారమే వ్యూహాలు అమలు చేయాలి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. 198 టార్గెట్ ఛేదించగలమనే అనుకున్నాం. నేను ముందే చెప్పినట్టుగా మేం మా వ్యూహాలను మార్చుకోవాలి' అని హిట్‌మ్యాన్ చెప్పాడు.
PBKSపై ముంబయి ఛేదన సాగిందిలా
ఇక ముంబై ఇండియన్స్‌కు మాత్రం ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (28: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇషాన్ కిషన్ (3: 6 బంతుల్లో) వరుస ఓవర్లలో అవుటయ్యారు. అనంతరం యువ బ్యాటర్లు డెవాల్డ్ బ్రెవిస్ (49: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), తిలక్ వర్మ (36: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నారు. బౌండరీలు కొడుతూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి డెవాల్డ్ బ్రెవిస్ అవుటయ్యాడు.
అయితే సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా కీరన్ పొలార్డ్ (10: 11 బంతుల్లో, ఒక ఫోర్), తిలక్ వర్మ అవుట్ కావడం ముంబైని దెబ్బ తీసింది. సూర్యకుమార్ (43: 30 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) వేగంగా ఆడటానికి ప్రయత్నించినా తనొక్కడే స్పెషలిస్ట్ బ్యాటర్ కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో రబడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివర్లో జయదేవ్ ఉనద్కత్ (12: 7 బంతుల్లో, ఒక సిక్సర్) ఆశలు రేపినా ముంబై విజయానికి ఆ ఊపు సరిపోలేదు.