PBKS vs MI, Match Highlights: ముంబై రనౌట్ - చేజేతులా వికెట్లు చేజార్చుకుని - 12 పరుగులతో పంజాబ్ విక్టరీ!
IPL 2022, PBKS vs MI: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ముంబై ఇండియన్స్‌కు వరుసగా ఐదో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 186 పరుగులకే పరిమితం అయింది.
అదరగొట్టిన ఓపెనర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (52: 32 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), శిఖర్ ధావన్ (70: 50 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఒకరితో ఒకరు పోటీ పడి ఆడటంతో పంజాబ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేయగలిగింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 97 పరుగులు జోడించిన అనంతరం మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు. అయితే అప్పటికే తన అర్థ సెంచరీ పూర్తయింది.
మయాంక్ అగర్వాల్ అవుటయినా ధావన్ వేగం తగ్గించలేదు. బెయిర్‌స్టో (12: 13 బంతుల్లో, ఒక ఫోర్), లివింగ్‌స్టోన్ (2: 3 బంతుల్లో) విఫలమైనా స్కోరు పడిపోకుండా చక్కగా బ్యాటింగ్ చేశాడు. 17వ ఓవర్ చివరి బంతికి తను అవుటైనా... చివర్లో జితేష్ శర్మ (30 నాటౌట్:15 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), షారుక్ ఖాన్ (15: 6 బంతుల్లో, రెండు సిక్సర్లు) వేగంగా ఆడటంతో పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
ఒత్తిడిలో రనౌట్
ఇక ముంబై ఇండియన్స్‌కు మాత్రం ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (28: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇషాన్ కిషన్ (3: 6 బంతుల్లో) వరుస ఓవర్లలో అవుటయ్యారు. అనంతరం యువ బ్యాటర్లు డెవాల్డ్ బ్రెవిస్ (49: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), తిలక్ వర్మ (36: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నారు. బౌండరీలు కొడుతూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి డెవాల్డ్ బ్రెవిస్ అవుటయ్యాడు.
అయితే సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా కీరన్ పొలార్డ్ (10: 11 బంతుల్లో, ఒక ఫోర్), తిలక్ వర్మ అవుట్ కావడం ముంబైని దెబ్బ తీసింది. సూర్యకుమార్ (43: 30 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) వేగంగా ఆడటానికి ప్రయత్నించినా తనొక్కడే స్పెషలిస్ట్ బ్యాటర్ కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో రబడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివర్లో జయదేవ్ ఉనద్కత్ (12: 7 బంతుల్లో, ఒక సిక్సర్) ఆశలు రేపినా ముంబై విజయానికి ఆ ఊపు సరిపోలేదు.