IPL 2022: ఐపీఎల్ చరిత్రలోనే Mumbai Indians చెత్త రికార్డ్, 5 ట్రోఫీలు నెగ్గిన రోహిత్ సేనకు ఏమైంది ?
IPL 2022 Mumbai Indians Records: ఐపీఎల్ సీజన్ 15లో ఇప్పటివరకూ తమ విజయాల ఖాతా తెరవని జట్టు ఏదైనా ఉందంటే అది ముంబైనే. మెగా టోర్నీలో 5 పర్యాయాలు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టేనా ఇలా ఆడేది అంటున్నారు.
IPL 2022: Mumbai Indians create dubious record for worst-ever start in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో ముంబై ఇండియన్స్‌కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్ సీజన్ 15లో ఇప్పటివరకూ తమ విజయాల ఖాతా తెరవని జట్టు ఏదైనా ఉందంటే అది ముంబైనే. మెగా టోర్నీలో 5 పర్యాయాలు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టేనా ఇలా ఆడేది అని క్రికెట్ ప్రేమికులను ఆలోచింపంచేస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ మరో చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠపోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమితో లీగ్ చరిత్రలో వరుసగా తొలి 7 మ్యాచ్‌లు ఓడిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. 2014లో రోహిత్ కెప్టెన్సీలో ముంబై టీమ్ వరుసగా 5 మ్యాచ్‌లు ఓడగా.. తాజా సీజన్‌లో మరింత పేలవ ప్రదర్శన చేస్తోంది
ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డులు..
ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో వరుసగా 6 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఓడిన 7వ జట్టుగా రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై జట్టు ఊహించని రికార్డు తన ఖాతాలో వేసుకుంది. కానీ సీజన్ ప్రారంభంలో తొలి 7 మ్యాచ్‌లలో ఓడిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును నమోదుచేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6, 6, 9 మ్యాచ్‌లను 2013, 2013, 2014 సీజన్లలో వరుసగా ఓడిపోయింది. పుణే వారియర్స్ 2012, 2013 సీజన్లలో వరుసగా 9 మ్యాచ్‌ల చొప్పున ఓటమిచెందాయి. కేకేఆర్ టీమ్ 2009లో వరుసగా 9 మ్యాచ్‌లను ఓడింది. దక్కన్ ఛార్జర్స్ టీమ్ 2008 సీజన్‌లో వరుసగా 7 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్ 2015 సీజన్లో వరుసగా 7 మ్యాచ్‌లలో దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. ఆర్సీబీ టీమ్ 2017లో తొలిసారి వరుసగా 6 మ్యాచ్‌లను ఓడగా.. 2019లోనూ మరోసారి వరుస 6 మ్యాచ్‌లను ఓటమిపాలైంది.
5 ట్రోఫీలు నెగ్గిన టీమ్ ఇంత దారుణమా..
ఐపీఎల్ 2022లో హాట్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. ఓటమితో సీజన్‌ను ఆరంభించడం ముంబైకి అలవాటే అని అంతా అనుకున్నారు. కానీ ఆపై వరుసగా రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడింది. ఇలా మూడో, నాలుగో, అయిదో, ఆరో మ్యాచ్‌లలో రోహిత్ సేన ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నెగ్గి విజయాల ఖాతా తెరుస్తుందని భావించిన ముంబైకి సీఎస్కే సైతం షాకిచ్చింది. దాంతో ముంబై టీమ్ వరుసగా 7వ మ్యాచ్‌లో దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది.
A heartbreaking loss on the last ball. 😔
— Mumbai Indians (@mipaltan) April 21, 2022
Well played MSD. #OneFamily #DilKholKe #MumbaiIndians #MIvCSK pic.twitter.com/jWAlu8lg1j
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (0: 1 బంతి), రోహిత్ శర్మలను (0: 2 బంతుల్లో) సీఎస్కే బౌలర్ ముఖేష్ చౌదరి డకౌట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (51 నాటౌట్) రాణించారు. జయదేవ్ ఉనద్కత్ (19), హృతిక్ షౌకీన్ (25) పరవాలేదనిపించారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై టీమ్ సీనియర్ ప్లేయర్లు రాబిన్ ఊతప్ప (30), అంబటి రాయుడు (40) రాణించారు. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా, ధోనీ మరోసారి ఫినిషర్‌గా మారిపోయాడు. చివరి బంతికి ఫోర్ కొట్టిన మహేంద్ర సింగ్ ధోని (28 నాటౌట్: 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) చెన్నైకి సీజన్‌లో రెండో విజయాన్ని అందించాడు.
Also Read: IPL 2022, Kuldeep Yadav: పంత్ వల్లే నేనిలా! MOM అవార్డును అక్షర్‌తో పంచుకుంటా!