SRH Vs LSG: రైజర్స్ రాత మారలేదు - లక్నో చేతిలో 12 పరుగులతో ఓటమి - ఆఖర్లో బొక్కబోర్లా!
ఐపీఎల్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 12 పరుగులతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితం అయింది. దీంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే కొనసాగుతోంది.
పడుతూ, లేస్తూనే...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి 27 పరుగులకే క్వింటన్ డికాక్ (1: 4 బంతుల్లో), ఎవిన్ లెవిస్ (1: 5 బంతుల్లో), మనీష్ పాండే (11: 10 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అవుటయ్యారు. ఆ తర్వాత పంజాబ్‌ను దీపక్ హుడా (51: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), కెప్టెన్ కేఎల్ రాహుల్ (68: 50 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఆదుకున్నారు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించి పంజాబ్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఈ క్రమంలోనే దీపక్ హుడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే రొమారియో షెపర్డ్... దీపక్ హుడాను అవుట్ చేసి సన్‌రైజర్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. దీపక్ హుడా అవుట్ అయినా... కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వేగంగా ఆడుతూనే తను కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే చివర్లో వరుసగా వికెట్లు పడటంతో పంజాబ్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఆయుష్ బదోని (19: 12 బంతుల్లో, మూడు ఫోర్లు) కొంచెం వేగంగా ఆడినా... తనకు సరైన సహకారం లభించలేదు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులకు పరిమితం అయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు.
అందే లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయారు...
ఇక సన్‌రైజర్స్‌కు కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ (13: 11 బంతుల్లో, రెండు ఫోర్లు), కేన్ విలియమ్సన్‌లు (16: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) పవర్ ప్లేలోనే పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు అవుటయ్యే సరికి సన్‌రైజర్స్ స్కోరు 38 పరుగులు మాత్రమే.
ఈ దశలో ఎయిడెన్ మార్క్రమ్ (12: 14 బంతుల్లో), రాహుల్ త్రిపాఠి (44: 30 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) సన్‌రైజర్స్‌ను ఆదుకున్నారు. మార్క్రమ్ నిదానంగా ఆడినా... రాహుల్ త్రిపాఠి వేగంగా ఆడుతూ రన్‌రేట్‌ను పడిపోనివ్వలేదు. అయితే మార్క్రమ్, త్రిపాఠి కూడా వెంట వెంటనే అవుట్ కావడంతో భారం నికోలస్ పూరన్‌పై (34: 24 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) పడింది. తను బాగానే ఆడినా... సహకారం అందించే వారు లేకపోవడం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులకు పరిమితం అయింది.