IPL 2022, DC vs KKR: ఆడితే ఉంటారు! ఓడితే పోతారు! ఇకనుంచి దిల్లీ, కోల్‌కతాకు చావోరేవో
DC vs KKR Preview: ఐపీఎల్ 2022లో 41వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders) తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలో ఎవరిది పైచేయి?
IPL 2022 dc vs kkr preview delhi capitals vs kolkata knightriders head to head records : ఐపీఎల్ 2022లో 41వ మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders) తలపడుతున్నాయి. వాంఖడే మైదానం (Wankhede Stadium) ఇందుకు వేదిక. ఈ సీజన్లో వీరిద్దరూ తలపడుతున్న రెండో మ్యాచ్ ఇది. అప్పుడేం జరిగింది? ఈ రెండు జట్లలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచే ఛాన్స్ ఎవరికుంది?
మూమెంటమ్ అవసరం
ఐపీఎల్ 2022 సీజన్లో సగం మ్యాచులు ముగిశాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరుకొనే జట్లేవో చాలామంది ఒక అంచనాకు వచ్చేశారు. మొదట్లో వరుస విజయాలు అందుకోవడంతో కోల్‌కతాకు తిరుగులేదని భావించారు. పెద్ద పెద్ద పేర్లు కనిపించడంతో దిల్లీపై క్రేజ్ పెరిగింది. అయితే ఈ రెండు జట్లు కొన్ని మ్యాచుల్లో వరుస పరాజయాలు చవిచూడటంతో మూమెంటమ్ కోల్పోయాయి. దిల్లీ 7 మ్యాచుల్లో 3 గెలిచి 7, కేకేఆర్ 8లో 3 గెలిచి 8లో ఉన్నాయి. అంటే వీరు ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే ఇకపై ఆడే మ్యాచుల్లో కనీసం ఐదు గెలవాల్సి ఉంటుంది. లేదంటే ఆశలు వదిలేసుకోవాల్సిందే. అందుకే ఈ మ్యాచ్ వీరిద్దరికీ కీలకం. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 మ్యాచులాడగా కేకేఆర్ 16, డీసీ 12 గెలిచింది.
Delhi Capitalsకు ఛాన్స్
దిల్లీ క్యాపిటల్స్ కొన్ని రోజులు కొవిడ్‌తో బాధపడింది. ఇన్నాళ్లూ ఐసోలేషన్‌కు వెళ్లిన టిమ్ సీఫెర్ట్, మిచెల్ మార్ష్ తిరిగి జట్టులో చేరారు. డేవిడ్ వార్నర్ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. పృథ్వీ షా అతడికి చక్కగా సహకారం అందిస్తున్నాడు. మిడిలార్డర్ పరిస్థితి బాగాలేదు. పంత్ ఫామ్‌లో లేడు. రోమన్ పావెల్ మూమెంటమ్ అందుకోవడం శుభసూచకం. అక్షర్ పటేల్, కుల్‌దీప్ మళ్లీ వికెట్ల బాట పట్టాలి. శార్దూల్ ఠాకూర్ తన స్థాయికి తగ్గట్టు బౌలింగ్ చేయాలి. ముస్తాఫిజుర్, ఖలీల్ అహ్మద్ ఫర్వాలేదు.
KKR రైడ్ చేయాలి
కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితీ అలాగే ఉంది. ఓపెనింగ్ కాంబినేషన్ మార్చేశారు. ఆరోన్ ఫించ్ ఓ హాఫ్ సెంచరీతో ఆశలు రేపాడు. కానీ గాయపడ్డాడు. వెంకటేశ్ అయ్యర్‌ను మిడిలార్డర్‌కు పంపించారు. అతడింకా ఫామ్ అందుకోలేదు. శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్ జోరు పెంచాలి. వరుణ్, ఉమేశ్, టిమ్ సౌథీ బౌలింగ్ ఓకే. మొదట్లో ఉన్నటువంటి ఊపు, ఉత్సాహం ఇప్పుడా జట్టులో కనిపించడం లేదు.
DC vs KKR Probable XI
దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
కోల్‌కతా నైట్‌రైడర్స్: సామ్ బిల్లింగ్స్, సునిల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్, టిమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి