SRH Vs MI IPL2024: ఉప్పల్ మ్యాచ్‌కు వీటిని తేవద్దు , పోలీసుల మార్గనిర్దేశకాలు
SRH Vs MI : ల్యాప్ ట్యాప్, వాటర్ బాటిల్స్, బ్యానర్స్, లైటర్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్‌పై నిషేధమని, స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని స్పష్టం చేశారు.
Tight Security At Uppal Stadium And Will Not Allow Electronic Gadgets: ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో మ్యాచ్ కోసం 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి(CP Tarun Joshi) తెలిపారు. బుధవారం రాత్రి ముంబయి ఇండియన్స్(MI) - సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సీటింగ్ సామర్థ్యం 39 వేలు ఉందని, స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసులను మోహరిస్తామని తెలిపారు.
ల్యాప్ ట్యాప్, వాటర్ బాటిల్స్, బ్యానర్స్, లైటర్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్‌పై నిషేధమని, స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని స్పష్టం చేశారు. బ్లూటూత్స్ అనుమతిస్తామన్నారు. స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు. మ్యాచ్‌కి 3గంటల ముందు నుంచి ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు. నాలుగు అంబులెన్స్‌లు, మెడికల్ టీమ్స్, ఫైర్ ఇంజిన్లను సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. టికెట్ కొనుగోలు చేసిన వారి కోసం పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మ్యాచ్ నిర్వహణ కోసం పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీపీ చెప్పారు.
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్:
క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం హైదరాబాద్ సన్‌రైజర్స్(SRH)- ముంబయి ఇండియన్స్(MI) మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు భారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అభిమానుల సౌకర్యార్థం జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ మైదానానికి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఇవి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రారంభమై.. మ్యాచ్ అనంతరం తిరిగి రాత్రి 11.30గంటలకు స్టేడియం నుంచి బయల్దేరుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని ఉపయోగించుకొని మ్యాచ్‌ను వీక్షించాలని క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
బుధవారం ముంబై vs హైదరాబాద్, ఏప్రిల్ 5న చెన్నై vs హైదరాబాద్, ఏప్రిల్ 25న బెంగుళూరు vs హైదరాబాద్, మే 2న రాజస్థాన్ vs హైదరాబాద్, మే 8న లక్నో vs హైదరాబాద్, మే 16న గుజరాత్ vs హైదరాబాద్, మే 19న పంజాబ్ vs హైదరాబాద్ మ్యాచులు జరుగుతాయి. ఈ ఏడు మ్యాచులను ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో లేవు.
ఘట్‌కేసర్, ఎన్టీవోస్ కాలనీ, జీడిమెట్ల, జేబీఎస్, చార్మినార్ నుంచి ఉప్పల్ స్టేడియానికి నాలుగు బస్సులు నడుపుతామని ఆర్టీసీ వెల్లడించింది. ఇక హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, మిథాని ల్యాబ్ క్వార్టర్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, లక్డీకపూల్, దిల్‌సుఖ్ నగర్, కేపీహెచ్‌బీ, మేడ్చల్, మియాపూర్, హకీంపేట్, ఈసీఎల్ క్రాస్ రోడ్స్, బోయిన్ పల్లి, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, కొండాపూర్, బీహెచ్ఈఎల్, ఎల్బీనగర్ నుంచి రెండు చొప్పున బస్సులను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి నడుపుతామని పేర్కొంది. ఇవి కాకుండా..ఉప్పల్ స్టేడియం నుంచి ఉప్పల్ డిపోకు చెందిన 4 బస్సులు మెహిదీ పట్నానికి నడుస్తాయి.