IPL 2024: ఉప్పల్ సిబ్బంది మెరుపు ధర్నా, మ్యాచ్‌పై ఉత్కంఠ
SRH Vs RR: ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నిర్వహణపై తీవ్ర ఉత్కఠ నెలకొంది. దీంతో హెచ్‌సీఏ పెద్దల వ్యవహారశైలిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
Dharna By Staff At Uppal Stadium doubt about SRH Vs RR: బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియం సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. కాంప్లిమెంటరీ పాసులు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో నేడు ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నిర్వహణపై తీవ్ర ఉత్కఠ నెలకొంది. స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ సహా 94 మంది సిబ్బంది బుధవారం మధ్యాహ్నం మెరుపు ధర్నాకు దిగారు. ఆరు నెలలుగా బోనస్ ఇవ్వడం లేదని, ఇంక్రిమెంట్లు వేయడం లేదని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన మ్యాచ్ టికెట్లను ఇవ్వకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్ సమయంలోనే అధ్యక్షుడు జగన్మోహన్ రావు నాయకత్వంలోని కొత్త పాలక వర్గం ఇంక్రిమెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని.. నాలుగు నెలలు గడిచినా దాన్ని పట్టించుకోలేదన్నారు.
నేటి మ్యాచ్ కోసం రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ప్రాక్టీస్ వస్తున్న సమయంలోనే సిబ్బంది ధర్నా చేయడం చర్చనీయాంశంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు బకాయిలు చెల్లించలేదని స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనపై HCAపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. టికెట్ల అమ్మకాలు, కాంప్లిమెంటరీ పాసుల జారీ, మ్యాచ్ ల సమయంలో స్టేడియం మెయింటెన్స్ తీరుపైనా కొత్త పాలక వర్గంపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేడియం సిబ్బంది ధర్నాకు దిగడంతో హెచ్‌సీఏ పెద్దల వ్యవహారశైలిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
నేడే మ్యాచ్- హైదరాబాద్‌పైనే ఒత్తిడి
చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌లపై వరుసగా విజయాలు నమోదు చేసి చాలా పటిష్టంగా కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా ఎదురవుతున్న పరాజయాలకు రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెక్ పెట్టాలని చూస్తోంది. ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్న రాజస్థాన్‌పై ఎలా ఆడుతుందో చూడాలి. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు లక్ష్య ఛేదనలో వరుసగా విఫలమవుతున్నారు. ఈ సీజన్‌లో SRH 250 పరుగుల మార్క్‌ను మూడుసార్లు అధిగమించింది, అయితే ఈ మూడు సార్లు కూడా హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడే ఈ స్కోరు నమోదు చేసింది. తాము లక్ష్యాన్ని సులువుగానే ఛేదిస్తామని.. కానీ తమలో ఇంకా అది బయటకు రాలేదని కెప్టెన్ కమిన్స్ చెప్పాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడితే రాజస్థాన్‌పై గెలుపు అంత కష్టం కాదు. ఐడెన్ మార్క్రామ్ మరింత మెరుగ్గా రాణించాలని హైదరాబాద్ జట్టు కోరుకుంటోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ చాలా బలంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌పై కూడా విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ప్లే ఆఫ్‌కు చేరాలని చూస్తోంది. 16 పాయింట్లతో పట్టికలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్‌లతో రాజస్థాన్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.