Chris Jordan: క్రిస్ జోర్డాన్‌ను జట్టులో చేర్చుకున్న ముంబై - ఎవరి స్థానంలో వచ్చాడు?
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ క్రిస్ జోర్డాన్‌ను తమ జట్టులో చేర్చుకుంది.
Mumbai Indians Sign Chris Jordan As Replacement: ఐపీఎల్ 16వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం ముంబై ఇండియన్స్ జట్టు క్రిస్ జోర్డాన్‌ను వారి జట్టులో చేర్చుకుంది. అయితే ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ముంబై ఇండియన్స్ ఏ ఆటగాడి స్థానంలో జోర్డాన్‌ను తమ జట్టులో చేర్చుకున్నారో ఇంకా తెలియజేయలేదు.
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఇంతవరకు సరిగ్గా సాగలేదు. సీజన్ ప్రారంభానికి ముందే జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో దూరం అయ్యాడు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ కొన్ని మ్యాచ్‌ల తర్వాత అన్‌ఫిట్‌గా నిష్క్రమించాడు. దీని ప్రభావం జట్టు బౌలింగ్‌పై స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ తన జట్టులో జోర్డాన్‌ను చేర్చుకుంది.
క్రిస్ జోర్డాన్ గతంలో ఐపీఎల్‌లో నాలుగు విభిన్న ఫ్రాంచైజీల్లో భాగమయ్యాడు. అతను మొదట 2016 సంవత్సరంలో ఆడిన సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఆడాడు. ఆ తర్వాత అతను సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లలో కూడా భాగమయ్యాడు. గత ఐపీఎల్ సీజన్‌లో క్రిస్ జోర్డాన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడే అవకాశం లభించింది.
క్రిస్ జోర్డాన్ ఐపీఎల్ కెరీర్ ఇప్పటివరకు ఇలాగే సాగింది
ఐపీఎల్‌లో క్రిస్ జోర్డాన్ ప్రదర్శన గురించి చెప్పాలంటే అతను ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 30.85 సగటుతో 27 వికెట్లు తీసుకున్నాడు. ఈ సమయంలో జోర్డాన్ ఎకానమీ రేటు 9.32గా ఉంది. క్రిస్ జోర్డాన్ ఇంగ్లండ్ తరఫున 87 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 27.31 సగటుతో 96 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌లో నేటి రాత్రి ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య వాంఖెడే (ముంబై) వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఐపీఎల్ లీగ్ చరిత్రలో 1000వ మ్యాచ్ కావడం గమనార్హం.
వాంఖెడేలో జరుగుబోయే 1000వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా స్పెషల్. ఇవాళ (ఏప్రిల్ 30) హిట్‌మ్యాన్ పుట్టినరోజు. అదీగాక ముంబై ఇండియన్స్ పగ్గాలు (2013 ఏప్రిల్ 24) చేపట్టి కూడా పది సంవత్సరాలు పూర్తి కావొచ్చింది. అంతేగాక కెప్టెన్ గా రోహిత్ కు ఇది 150వ మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌ను గెలిచి రోహిత్‌కు బర్త్ డే గిఫ్ట్ గా అందజేయాలని ముంబై ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఓపెనర్ గా ఇషాన్ కిషన్ విఫలమవుతున్నా కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ మంచి టచ్ లో ఉన్నారు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టచ్ లోకి వచ్చిన సూర్య గుజరాత్ తో కూడా బాగానే ఆడాడు. చివర్లో టిమ్ డేవిడ్ కూడా ఓ చేయి వేస్తే వాంఖెడేలో పరుగుల వరద ఖాయం. మరి వీరి రాజస్తాన్ బౌలర్లను ఎలా ఎదుర్కుంటారన్నది ఆసక్తికరం.
బౌలింగ్ లో ఆ జట్టు కీలక పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలున్నాయి. అర్జున్ టెండూల్కర్, జేసన్ బెహ్రాన్‌డార్ఫ్ లు పేస్ బాధ్యతలు మోయనున్నారు. ఆర్చర్ వస్తే వీరిలో ఎవరో ఒకరు బెంచ్ కే పరిమితం కావొచ్చు. స్పిన్నర్లలో పీయూష్ చావ్లా ఫామ్ కొనసాగిస్తుండటం ముంబైకి కలిసొచ్చేదే.