IPL new Teams: ఈ దీపావళికి బీసీసీఐకి కాసుల పంట! కొత్త జట్లు, మీడియా హక్కుల వేలంతో వేల కోట్ల ఆదాయం
ఐపీఎల్ కొత్త జట్లకు అంచనాలకు మించి డిమాండ్ లభిస్తోంది. కనీస ధర రూ.2000 కోట్ల నుంచి ఫ్రాంచైజీలు ధర పలుకుతాయని అంచనా వేస్తున్నారు. మీడియా హక్కులతోనూ బీసీసీఐకి కాసుల పంట పండనుంది.
ఈ దీపావళి బీసీసీఐకి కాసుల పంట పండించబోతోంది! ఐపీఎల్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆ వెంటనే మీడియా ప్రసార హక్కులను బోర్డు వేలం వేయనుంది. వీటి ద్వారా బీసీసీఐకి వేల కోట్ల రూపాయాల ఆదాయం రాబోతోంది.
కనీస ధర రూ.2000 కోట్లు
వచ్చే ఏడాది పది జట్లతో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమైంది. ఇందుకు అన్ని ఏర్పాట్లనూ చకచకా చేసేస్తోంది. మరో రెండు ఫ్రాంచైజీల కోసం బిడ్లను ఆహ్వానించింది. కొత్త ఫ్రాంచైజీల కనీస ధర రూ.2000 కోట్లుగా నిర్ణయించింది. వీటిని కైవసం చేసుకొనేందుకు బడా పారిశ్రామిక వేత్తలు వరుస కట్టడంతో డిమాండ్ బాగా పెరిగింది. ఒక్కో ఫ్రాంచైజీకి కనీసం రూ.3500 కోట్లకు పైగా ధర పలుకుతుందని బీసీసీఐ ధీమాగా ఉంది.
Also Read: రాజస్తాన్‌కు గెలుపు కంపల్సరీ.. కోహ్లీ సేనతో నేడే ఢీ!
రూ.3500 కోట్లకు డిమాండ్
ఇప్పటికే పన్నెండు పార్టీలు ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ బిడ్ పత్రాలను కొనుగోలు చేశాయని తెలిసింది. పత్రాలు కొనుగోలు చేసేందుకు అక్టోబర్ పది ఆఖరు తేదీ కావడంతో మరికొన్ని సంస్థలూ ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని తెలిసింది. 'కొత్త జట్లను కొనుగోలు చేసేందుకు మేం ఊహించిన దానికన్నా ఎక్కువ మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత స్పందనతో మేం ఆశ్చర్యంలో మునిగిపోయాం. ఒక్కో జట్టు రూ.3500 కోట్లకు పైగా ధర పలుకుతుందని అంచనా వేస్తున్నాం' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Also Read: ఎట్టకేలకు లైన్‌లోకి వచ్చిన ముంబై.. పంజాబ్‌పై ఆరు వికెట్లతో విజయం
రంగంలోకి దిగని అదానీ
సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్‌జీ గ్రూప్, అరబిందో ఫార్మా, టొరెంట్ ఫార్మా, బ్రాడ్ కాస్ట్ అండ్ స్పోర్ట్స్ కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఐటీడబ్ల్యూ, గ్రూప్ ఎం, సింగపూర్ కేంద్రంగా ఏర్పడిన ప్రైవేట్ ఈక్విటీ, ఇతర పార్టీల కన్సార్టియం ఐపీఎల్ జట్ల బిడ్ పత్రాలు కొనుగోలు చేశాయని తెలిసింది. అదానీ గ్రూప్ మాత్రం ఇంకా కొనుగోలు చేయకపోవడం గమానర్హం. అక్టోబర్ పది చివరి తేదీ కావడంతో ఆ లోపు పోటీలోకి ప్రవేశిస్తారని అంటున్నారు. అక్టోబర్ 25న దుబాయ్ వేదికగా కొత్త జట్ల వేలం జరుగుతుంది.
Also Read: దిల్లీకి కోల్‌కతా చెక్..! 3 వికెట్ల తేడాతో విజయం.. ప్లేఆఫ్స్ వైపు పరుగులు!
వెంటనే మీడియా హక్కులు
ఐపీఎల్ మీడియా, ప్రసార హక్కులకూ బీసీసీఐ టెండర్లు ఆహ్వానించనుంది. ప్రస్తుతం స్టార్ ఇండియా ఐపీఎల్‌ను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022కు స్టార్ హక్కులు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో 2023-2027 కాలానికి బీసీసీఐ వేలం టెండర్లు ఆహ్వానించనుంది. కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించిన వెంటనే ఈ పక్రియ మొదలవుతుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
🚨 NEWS 🚨: BCCI announces Tender of IPL Media Rights for 2023-2027 cycle
— BCCI (@BCCI) September 28, 2021
More Details 🔽https://t.co/AVUYyIQaZ2 pic.twitter.com/mosCNzmyGo