Abhishek Porel: పంత్ ప్లేస్‌లో పోరెల్‌ను తీసుకున్న ఢిల్లీ - అసలు ఎవరు ఇతను?
ఐపీఎల్ 2023లో రిషబ్ పంత్ స్థానంలో యువ ఆటగాడు అభిషేక్ పోరెల్ జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది.
Abhishek Porel Delhi Capitals: ఐపీఎల్ 2023లో రిషబ్ పంత్ రీప్లేస్‌మెంట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. ఐపీఎల్ 2023లో రిషబ్ స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌ని చేర్చారు. గాయం కారణంగా రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతని గైర్హాజరీతో డేవిడ్ వార్నర్‌ను జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. కాగా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ పాత్రను పోషించనున్నారు.
అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలు
మీడియా కథనాల ప్రకారం బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేర్చారు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ రిషబ్ పంత్ స్థానంలో భారత వికెట్ కీపర్‌లలో కొందరిపై ట్రయల్స్ తీసుకున్నాడు. ఐదు నుంచి ఆరు రోజుల పాటు సాగిన ఈ ట్రయల్‌లో పలువురు వికెట్‌కీపర్లను ఢిల్లీకి పిలిపించారు. ఈ వికెట్ కీపర్లలో అభిషేక్ పోరెల్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేర్చనున్నట్లు చెబుతున్నారు.
కారు ప్రమాదంలో పంత్‌కు గాయాలు
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. ఆ తర్వాత ముంబైకి రిఫర్ చేశారు. పంత్ కోలుకుంటున్నా కానీ IPL 2023కి పూర్తిగా దూరం అయ్యాడు. రిషబ్ పంత్ ఫిట్‌గా మారటానికి దాదాపు ఆరు నుంచి ఏడు నెలల వరకు పట్టవచ్చు.
అభిషేక్ పోరెల్ రికార్డు ఎలా ఉంది?
20 ఏళ్ల అభిషేక్ పోరెల్ బెంగాల్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. అతని టీ20 గణాంకాలు చూస్తే అంత బాగా లేవు. మూడు టీ20 మ్యాచ్‌ల్లో అభిషేక్ 22 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ప్రాక్టీస్ సమయంలో పోరెల్ ఆకట్టుకున్నాడు. రిషబ్ పంత్ స్థానంలో అతనిని జట్టులోకి తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించడానికి కారణం ఇదే.
టీమ్‌ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు (Rishabh Pant) ప్రత్యామ్నాయం వెతకడం కష్టమని సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అంటున్నాడు. ఎవ్వరొచ్చినా అతడిలా ఆడటం కష్టమని పేర్కొన్నాడు. ఇషాన్ కిషన్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్ వేర్వేరు ఫార్మాట్లలో అందుబాటులో ఉన్నారని చెప్పాడు. అయితే ఎవరి స్టైల్ వారిదేనని వెల్లడించాడు. ప్రస్తుతం దాదా దిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
'రిషభ్ పంత్ చాలా స్పెషల్. అలాంటి క్రికెటర్ ఈజీగా దొరకడు. కానీ ఇషాన్ కిషన్ (Ishan kishan) అద్భుతంగా ఆడుతున్నాడు. కేఎస్ భరత్ అందుబాటులో ఉన్నాడు. అయితే వారిద్దరూ భిన్నంగా ఆడతారు. అందరూ ఒకేలా బ్యాటింగ్ చేయరు. అవకాశాలు దొరికినప్పుడు వీరు రాణిస్తారు. పొట్టి ఫార్మాట్లో కిషన్ ఎలా రెచ్చిపోతాడో తెలిసిందే. వన్డేల్లో కేఎల్ రాహుల్ (KL Rahul) 45 సగటుతో రెచ్చిపోతున్నాడు. వన్డేల్లో అతడికి తిరుగులేదు. అతడు బాగా ఆడితే ఎలాంటి సమస్యే ఉండదు' అని దాదా అన్నాడు.