RR vs RCB, Match Highlights: 'శ్రీకర విజయం'.. మాక్సీ విధ్వంసం: ప్లేఆఫ్స్ దిశగా బెంగళూరు
రాజస్థాన్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా ఛేదించింది. మాక్స్‌వెల్, శ్రీకర్ భరత్ విజయంలో కీలకంగా నిలిచారు. రాజస్థాన్‌లో ఎవిన్ లూయిస్ , యశస్వీ జైశ్వాల్ రాణించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ వైపు మరో అడుగు ముందుకేసింది. రాజస్థాన్ రాయల్స్‌పై సునాయాస విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. మాక్స్‌వెల్ (50*; 35 బంతుల్లో 3x4, 1x6) అర్ధశతక విధ్వంసానికి ఆంధ్రా ఆటగాడు శ్రీకర్ భరత్ (44; 35 బంతుల్లో 83x4, 1x6) సమయోచిత ఇన్నింగ్స్ తోడవ్వడంతో 17.1 ఓవర్లకు 7 వికెట్ల తేడాతో గెలిచింది. అంతకు ముందు రాజస్థాన్‌లో ఎవిన్ లూయిస్ (58; 37 బంతుల్లో 5x4, 3x6), యశస్వీ జైశ్వాల్ (31; 22 బంతుల్లో 3x4, 2x6) రాణించారు.
Also Read: వీరూ రికార్డుకు పంత్ బీటలు.. మేమేమైనా తక్కువా అంటున్న శ్రేయస్, ధావన్!
మాక్సీ విధ్వంసం.. శ్రీకర్ సమయోచితం
ఛేదనలో బెంగళూరు శుభారంభమే లభించింది. విరాట్ కోహ్లీ (25; 20 బంతుల్లో 4x4), దేవదత్ పడిక్కల్ (22; 17 బంతుల్లో 4x4) వరుస బౌండరీలతో హోరెత్తించారు. దాంతో స్కోరు 5 ఓవర్లకే 48 దాటింది. దూకుడుగా ఆడే క్రమంలో ముస్తాఫిజర్ వేసిన 5.2వ బంతికి పడిక్కల్ బౌల్డైనా పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు 54/1తో నిలిచింది. జోరు మీదున్న కోహ్లీ త్వరిత సింగిల్ కోసం ప్రయత్నించి రియాన్ పరాగ్ త్రోకు రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఆంధ్రా ఆటగాడు శ్రీకర్ భరత్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆచితూచి ఆడుతూనే మంచి బౌండరీలు బాదాడు. మాక్స్‌వెల్‌తో 69 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. సిక్సర్‌తో అర్ధశతకం సాధించే క్రమంలో ఫిజ్ వేసిన 15.6 బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో మాక్సీ వరుసగా 6, 2, 4, 2, 4, 4 బాదేసి 22 పరుగులు చేశాడు. 30 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. స్కోరును 149కి చేర్చాడు. తర్వాతి బంతిని డివిలియర్స్ బౌండరీ బాది లాంఛనం ముగించేశాడు.
Also Read: ఈ దీపావళికి బీసీసీఐకి కాసుల పంట! కొత్త జట్లు, మీడియా హక్కుల వేలంతో వేల కోట్ల ఆదాయం
అదిరే ఆరంభం.. ఆఖర్లో ఆయాసం!
రాజస్థాన్ ఆరంభం చూస్తే 200 స్కోరు చేసేలా కనిపించింది. అందుకు ఓపెనర్ల దూకుడే కారణం. ఎవిన్ లూయిస్, యశస్వీ జైశ్వాల్ ఒకరితో ఒకరు పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదేశారు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి 56 పరుగులు వచ్చాయి. జట్టు స్కోరు 77 వద్ద యశస్వీని ఔట్ చేయడం ద్వారా డాన్ క్రిస్టియన్ ఈ జోడీని విడదీశాడు. సంజు అండతో లూయిస్ చెలరేగాడు. 31 బంతుల్లోనే అర్ధశతకం అందుకోవడంతో 11 ఓవర్లకే రాజస్థాన్ వంద పరుగులు చేసేసింది.
అదే స్కోరు వద్ద 11.1వ బంతికి లూయిస్‌ను గార్టన్ ఔట్ చేయడంతో కథ మలుపు తిరిగింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ (2/18), షాబాజ్ అహ్మద్ (2/10) రాజస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. చక్కని స్పిన్, నెమ్మది బంతులతో ఇబ్బంది పెట్టారు. 113 వద్దే మహిపాల్ లోమ్రర్ (3), సంజు (19) ఔటయ్యారు. స్పిన్ ఆడలేక లియామ్ లివింగ్‌స్టన్ (6), రాహుల్ తెవాతియా (2), రియాన్ పరాగ్ (9), క్రిస్ మోరిస్ (14) చేతులెత్తేశారు. ఆఖర్లో హర్షల్ పటేల్ (3/34) వికెట్లు తీయడంతో రాజస్థాన్ 149/9కి పరిమితమైంది.
Also Read: ఎట్టకేలకు లైన్‌లోకి వచ్చిన ముంబై.. పంజాబ్‌పై ఆరు వికెట్లతో విజయం