BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?
BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ముసలం మొదలైనట్టే అనిపిస్తోంది! విదేశీ టీ20 లీగుల్లో భారతీయుల్ని అనుమతించబోమన్న బోర్డు నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు!
BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ముసలం మొదలైనట్టే అనిపిస్తోంది! విదేశీ టీ20 లీగుల్లో భారతీయుల్ని అనుమతించబోమన్న బోర్డు నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు! ఆటగాళ్లకు ఇవ్వకున్నా సహాయ సిబ్బంది, కోచ్, మెంటార్ బాధ్యతలకు అనుమతిస్తే ఇబ్బందేమిటని ప్రశ్నిస్తున్నారు. బోర్డు నిర్ణయం సరికాదని పేర్కొంటున్నారు.
వ్యూహబృందంలోకి
అంతర్జాతీయంగా టీ20 లీగ్ క్రికెట్ అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఎమిరేట్స్ బోర్డు నిర్వహించే ఐఎల్ టీ20, దక్షిణాఫ్రికాలోని సీఎస్‌ఏ టీ20 లీగులో ఐపీఎల్ యజమాన్యాలు ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి. ఆటగాళ్లకు అనుమతి ఇవ్వకున్నా వ్యూహబృందం, కోచ్, మెంటార్ సేవల కోసం భారతీయుల్ని ఉపయోగించుకోవాలని వారు భావిస్తున్నారు. ఇందుకూ అంగీకరించబోమని బోర్డు చెప్తుండటం వారికి నచ్చడం లేదని తెలిసింది.
బీసీసీఐ మాటేంటి?
'అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికేంత వరకు ఏ భారత ఆటగాడినీ విదేశీ లీగుల్లోకి అనుమతించం. దేశవాళీ క్రికెటర్లకూ ఇదే వర్తిస్తుంది. ఎవరైనా ఆ లీగుల్లో మెంటార్, కోచ్, ఇతర పాత్రలు పోషించాలనుకుంటే బోర్డుతో అన్ని బంధాలు తెంచుకోవాలి' అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు.
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆ లీగుల్లో మెంటార్ లేదా కోచ్‌గా ఉండొచ్చా అని ప్రశ్నించగా 'అలాంటప్పుడు అతడు సీఎస్‌కే తరఫున ఐపీఎల్ ఆడొద్దు. ముందు దానికి వీడ్కోలు పలకాలి' అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఓ ఫ్రాంచైజీ ప్రతినిధి స్పందించారు.
బోర్డు నిర్ణయం సరికాదు
'బీసీసీఐ నుంచి అధికారికంగా మాకేమీ సమాచారం అందలేదు. ఇప్పుడు వస్తున్న సమాచారం అంతా మీడియా ద్వారానే తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే బీసీసీఐ నిర్ణయం అసంబద్ధం, అనైతికం. విదేశీ లీగుల్లోనూ మా సహాయ సిబ్బంది, వ్యవస్థను వాడుకోవాలని అనుకుంటున్నాం. బోర్డు దానికి అడ్డుపడటం సరికాదు' అని ఆ ప్రతినిధి అంటున్నారు.
పెరుగుతున్న బిజినెస్
కరీబియన్ ప్రీమియర్ లీగులో ఐదు ఫ్రాంచైజీలుంటే అందులో మూడు భారతీయులే సొంతం చేసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అక్కడ జట్లు ఉన్నాయి. ఐఎల్ టీ20 లీగులో కేకేఆర్, ముంబయి, దిల్లీకి జట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఆరుకు ఆరూ ఐపీఎల్ ఓనర్లే సొంతం చేసుకోవడం గమనార్హం.
ధోనీ కోసం సీఎస్‌కే తిప్పలు
దక్షిణాఫ్రికా లీగు కోసం ఎంఎస్ ధోనీని మెంటార్‌గా ఉపయోగించుకోవాలని సీఎస్‌కే భావిస్తోంది. లక్ష్మీపతి బాలాజీని తీసుకెళ్లాలని అనుకుంటోంది. వీరు అక్కడ సేవలు అందించేందుకు బీసీసీఐ నిబంధనలు అంగీకరించవు. బోర్డుతో అన్ని బంధాలు తెంచుకోవడంతో సచిన్ తెందూల్కర్, జహీర్ ఖాన్ ఐఎల్‌టీ20, సీఎస్‌ఏ టీ20ల్లో సేవలు అందించొచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌కూ అవకాశం లేదు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కూ ఇలాంటి తలనొప్పులే ఉన్నాయి.
Also Read: ఆటోగ్రాఫ్ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్! గమ్చా అలంకరించిన హిమ దాస్!
Also Read: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!