IND vs NZ, T20 World Cup: వరల్డ్‌క్లాస్ టీం.. వరస్ట్ పెర్ఫార్మెన్స్.. ఎనిమిది వికెట్లతో టీమిండియా చిత్తు
India Vs New Zealand: దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్లతో ఓటమి పాలైంది.
టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్.. టీమిండియాను వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలం కావడంతో 20 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. సులభ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన 14.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్ సెమీస్ అవకాశాలు దాదాపు గల్లంతైనట్లే. రెండు వికెట్లు తీసిన ఇష్ సోధికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మూకుమ్మడి వైఫల్యం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఏదీ కలిసిరాలేదు. ఆశ్చర్యకరంగా రోహిత్‌ను కాదని ఇషాన్ కిషన్ (4: 8 బంతుల్లో, ఒక ఫోర్), కేఎల్ రాహుల్ (18: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) ఓపెనింగ్ చేశారు. అయితే వీరిద్దరూ పవర్ ప్లేలోనే అవుట్ అవ్వడంతో భారత్ ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. ఆ తర్వాత తొమ్మిదో ఓవర్లో రోహిత్ శర్మ (14: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అవుట్ అవ్వడం, విరాట్ కోహ్లీ (9: 17 బంతుల్లో) నిదానంగా ఆడటంతో స్కోరు బోర్డు నత్తనడకన ముందుకు సాగింది. 10 ఓవర్లలో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 48 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అవుట్ కావడంతో కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో సహజంగా దూకుడుగా ఆడే పంత్ (12: 19 బంతుల్లో), పాండ్యా (23: 24 బంతుల్లో, ఒక ఫోర్) మెల్లగా ఆడాల్సి వచ్చింది. దీంతో స్కోరు బోర్డు అస్సలు ముందుకు కదల్లేదు. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి పంత్ కూడా 15వ ఓవర్లో అవుటయ్యాడు. దీంతో 15 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు నష్టపోయి 73 పరుగులు చేసింది.
ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (26: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) చివర్లో కాస్త దూకుడుగా ఆడటంతో 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ నుంచి 17వ ఓవర్ వరకు 70 బంతుల పాటు భారత్ ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ట్రెంట్ బౌల్డ్ మూడు వికెట్లు తీయగా.. ఇష్ సోధి రెండు వికెట్లు తీశాడు. మిల్నే, సౌతీలకు చెరో వికెట్ దక్కింది.
ఎక్కడా ఇబ్బంది పడలేదు
కొట్టాల్సిన స్కోరు తక్కువగా ఉండటంతో న్యూజిలాండ్ ఎక్కడా ఒత్తిడికి లోనుకాలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో గుప్టిల్‌ను (20: 17 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుట్ చేసి బుమ్రా భారత్‌కు బ్రేక్ ఇచ్చినా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (33 నాటౌట్: 31 బంతుల్లో, మూడు ఫోర్లు), మరో ఓపెనర్ డేరిల్ మిషెల్‌తో (49: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) కలిసి రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించడంతో కివీస్ గెలుపు సులభం అయింది.
ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో మిషెల్ అవుటయనా, డెవాన్ కాన్వేతో (2: 4 బంతుల్లో) కలిసి విలియమ్సన్ మ్యాచ్‌ను ముగించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశాడు.
Also Read: T20 Worldcup 2021: విజయం కావాలా నాయనా.. ముందు ఇక్కడ గెలవాల్సిందే!
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి