IND Vs SL: శ్రీలంక ముందు 446 పరుగుల భారీ లక్ష్యం - రాణించిన శ్రేయస్, పంత్!
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ముందు 446 పరుగుల లక్ష్యం నిలిచింది.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా శ్రీలంక ముందు 446 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 303 పరుగుల స్కోరు వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 142 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే భారత్ మొత్తంగా 445 పరుగుల ముందంజలో ఉంది. దీంతో శ్రీలంక ముందు 446 పరుగుల లక్ష్యం నిలిచింది.
అంతకు ముందు 142 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా వేగంగా పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ 42 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ శర్మ, హనుమ విహారి, విరాట్ కోహ్లీ కూడా వరుస విరామాల్లో అవుటయ్యారు. రోహిత్ శర్మ త్రుటిలో అర్థ సెంచరీ మిస్సయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే హనుమ విహారి, విరాట్ కోహ్లీ వెనుదిరిగారు.
ఈ దశలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ అర్థ సెంచరీలతో చెలరేగడంతో స్కోరు పరుగులు పెట్టింది. కేవలం 28 బంతుల్లోనే పంత్ అర్థ శతకం పూర్తయింది. భారత్ తరఫున ఇదే టెస్టుల్లో వేగవంతమైన అర్థ సెంచరీ కావడం విశేషం.
వీరిద్దరూ అవుటయ్యాక రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో తొమ్మిది వికెట్ల నష్టానికి 303 పరుగులు వద్ద టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. శ్రీలంక బౌలర్లలో జయవిక్రమ నాలుగు వికెట్లు తీయగా... ఎంబుల్డెనియా మూడు వికెట్లు తీశారు. విశ్వ ఫెర్నాండో, ధనంజయ డిసిల్వలకు చెరో వికెట్ దక్కింది.
View this post on Instagram