(Source: ECI/ABP News/ABP Majha)
Rohit Sharma Captaincy: రోహిత్ కెప్టెన్సీలో ఇష్టమైంది అదే! కోహ్లీ సారథ్యంలో ఆడిన యువ పేసర్ అభిప్రాయం ఇదీ!
కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని యువ పేసర్ హర్షల్ పటేల్ అంటున్నాడు. ఆటగాళ్లకు పదేపదే సలహాలు ఇవ్వడని పేర్కొన్నాడు. జట్టు సభ్యుల సామర్థ్యాన్ని అతడు బాగా విశ్వసిస్తాడని వెల్లడించాడు.
టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో ప్రశాంతంగా ఉంటాడని యువ పేసర్ హర్షల్ పటేల్ అంటున్నాడు. ఆటగాళ్లకు అతడు పదేపదే సలహాలు ఇవ్వడని పేర్కొన్నాడు. జట్టు సభ్యుల సామర్థ్యాన్ని అతడు బాగా విశ్వసిస్తాడని వెల్లడించాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీసుకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.
హర్షల్ పటేల్ కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్ ఆడాడు. అయినా అతడికి జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. గతేడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు తన బౌలింగ్‌లో మార్పులు చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ సారథ్యంలో రాణించాడు. సీజన్లోనే అత్యధిక వికెట్లు పడగొట్టాడు. దాంతో అతడికి టీమ్‌ఇండియాలో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీసులో అతడు రోహిత్ సారథ్యంలో అరంగేట్రం చేశాడు.
'మనపై నమ్మకం ఉంటే రోహిత్ శర్మ మన చేతికి బంతినిస్తాడు. ఏం చేయాలో చెప్పడు. ఎందుకంటే ఏం చేయాలో మనకు తెలుసని ఆయన నమ్ముతాడు. వెళ్లి పోరాడాలని కోరుకుంటాడు. అలాంటి నాయకుడి నేతృత్వంలో ఆడటం బాగుంటుంది. ఆటను బాగా ఆస్వాదించొచ్చు' అని హర్షల్ పటేల్ అన్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు తనపై దూకుడు ప్రదర్శించినప్పుడు తన వద్ద వేర్వేరు ప్రణాళికలు ఉంటాయని వెల్లడించాడు.
'నా వద్ద ప్లాన్ ఏ, బీ, సీ ఉంటాయి. అందుకే బ్యాటర్లు నాపై ఆధిపత్యం ప్రదర్శించేటప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. బయట నుంచి వచ్చే విపరీతమైన సలహాలు తీసుకోవడం నాకిష్టం ఉండదు. రోహిత్ శర్మ సరిగ్గా ఆ కోవకే చెందుతాడు. అనవసరంగా సలహాలు ఇవ్వడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. బౌలర్‌కు స్వేచ్ఛనిస్తాడు' అని హర్షల్ తెలిపాడు.
న్యూజిలాండ్ సిరీసులో హర్షల్ ఆఖరి రెండు మ్యాచులు ఆడాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా అదే తొలి సిరీస్ కావడం గమనార్హం. ఆ తర్వాత వన్డే కెప్టెన్‌గా ఎంపికైనా గాయపడటంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు.
Also Read: Sourav Ganguly: ఐపీఎల్ 2022 ఇక్కడే.. త్వరలో మహిళల ఐపీఎల్ కూడా.. గంగూలీ ఏమన్నారంటే?
A BOLD welcome to Daniel Sams and @HarshalPatel23 as they join the RCB family for the 2021 IPL. 🤩#PlayBold #NowARoyalChallenger #WelcomeDanSams #WelcomeHarshalPatel #IPL2021 pic.twitter.com/dJ54dJJKjO
— Royal Challengers Bangalore (@RCBTweets) January 22, 2021