IND vs WI, Match Highlights: సిరీస్ గెలిచేసిన టీమిండియా - 19వ ఓవర్లో భువీ మ్యాజిక్!
IND vs WI, 2nd T20: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఎనిమిది పరుగులతో విజయం సాధించింది.
![IND vs WI, Match Highlights: సిరీస్ గెలిచేసిన టీమిండియా - 19వ ఓవర్లో భువీ మ్యాజిక్! IND vs WI, 2nd T20: India won the match by 8 runs against West Indies at Eden Garden Stadium IND vs WI, Match Highlights: సిరీస్ గెలిచేసిన టీమిండియా - 19వ ఓవర్లో భువీ మ్యాజిక్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/18/53fa0ab0f4812b29e314ae7ebc966880_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రిషబ్ పంత్ (52 నాటౌట్: 28 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (52: 41 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. నికోలస్ పూరన్ (62: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు), రొవ్‌మన్ పావెల్ (68 నాటౌట్: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) సత్తా విజయానికి సరిపోలేదు. దీంతో సిరీస్ 2-0తో భారత్ సొంతమైంది.
187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ మొదటి వికెట్‌కు 5.1 ఓవర్లలో 34 పరుగులు జోడించారు. మొదట కైల్ మేయర్స్‌ను యుజ్వేంద్ర చాహల్ అవుట్ చేయగా... బ్రాండన్ కింగ్ వికెట్‌ను రవి బిష్ణోయ్ తీశాడు. అయితే ఆ తర్వాత మూడో వికెట్‌కు నికోలస్ పూరన్, రొవ్‌మన్ పావెల్ కలిసి 62 బంతుల్లోనే 100 పరుగులు జోడించి వెస్టిండీస్‌ను గెలుపువైపు నడిపించారు.
అయితే విజయానికి కొద్ది దూరంలో పూరన్‌ను భువీ అవుట్ చేశాడు. 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో భువీ తన ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి పూరన్ వికెట్ తీశాడు. దీంతో వెస్టిండీస్ చివరి ఓవర్లో 25 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి ఓవర్లో పావెల్ రెండు సిక్సర్లతో భయపెట్టినా... హర్షల్ జాగ్రత్తగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ 178 పరుగులకే పరిమితం అయింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇషాన్ కిషన్ (2: 10 బంతుల్లో) అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (19: 18 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (52: 41 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
వీరిద్దరూ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించిన అనంతరం చేజ్ టీమిండియాను పెద్ద దెబ్బ కొటాడు. తన మొదటి ఓవర్లో రోహిత్ శర్మను, రెండో ఓవర్లో సూర్యకుమార్ యాదవ్‌ను (8: 6 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేసిన చేజ్... తన నాలుగో ఓవర్లో విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. అదే ఓవర్లో సిక్సర్‌తో విరాట్ తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి టీమిండియా స్కోరు 13.4 ఓవర్లలో 106-4 మాత్రమే.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (52 నాటౌట్: 28 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), వెంకటేష్ అయ్యర్ (33: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఐదో వికెట్‌కు కేవలం 35 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మూడు వికెట్లు తీయగా... రొమారియో షెపర్డ్, షెల్డన్ కాట్రెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడుగురు బౌలర్లను ఉపయోగించడం విశేషం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)