Harshal Patel: అరుదైన రికార్డుకు చేరువలో హర్షల్ పటేల్.. నేటి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీస్తే చాలు.. సాధించగలడా?
ఐపీఎల్‌లో నేడు కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీస్తే.. హర్షల్ పటేల్ 2013 సంవత్సరం నాటి బ్రేవో రికార్డును బద్దలు కొడతాడు.
ఐపీఎల్‌లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో(కేకేఆర్) తలపడనుంది. బెంగళూరు మీడియం పేసర్ హర్షల్ పటేల్‌కు ఈ ఐపీఎల్ డ్రీమ్ సీజన్ అని చెప్పవచ్చు. ఈ సీజన్‌లో హర్షల్ ఇప్పటివరకు 30 వికెట్లు తీసుకోవడం విశేషం.
ఇదే సమయంలో తను ఐపీఎల్‌లో ఒక కొత్త రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో మరో మూడు వికెట్లు తీస్తే ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అవుతాడు. ఈ రికార్డు ప్రస్తుతానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో పేరు మీద ఉంది. 2013 సీజన్‌లో బ్రేవో 32 వికెట్లు తీశాడు.
హర్షల్ పటేల్ హర్యాణా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ ఐపీఎల్‌లో హర్షల్ 30 వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ ప్రస్తుతానికి తన చేతిలోనే ఉంది. రెండో స్థానంలో ఉన్న ఆవేష్ ఖాన్ 23 వికెట్లతో హర్షల్‌కు చాలా దూరంలో ఉన్నాడు.
హర్షల్ పటేల్ ఈ సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనపరిచాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్ రికార్డును తను ఇప్పటికే బద్దలు కొట్టాడు. ఈ రికార్డు గతంలో బుమ్రా పేరు మీద ఉండేది. ఐపీఎల్ 2020 సీజన్‌లో తను 27 వికెట్లు తీశాడు.
అంతేకాకుండా ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ కూడా హర్షల్ పటేలే. గతంలో ఈ రికార్డు జస్‌ప్రీత్ బుమ్రా పేరు మీద ఉండేది. ఈ సీజన్‌లో తను ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు కూడా తీశాడు.
అయితే ఈ మ్యాచ్‌లోనే తను మూడు వికెట్లు తీయకపోయినా.. బెంగళూరు విజయం సాధించి టోర్నీలో ముందడుగు వేస్తే మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుంది. కాబట్టి ఆ మ్యాచ్‌లో అయినా తీయవచ్చు. కానీ ఈ మ్యాచ్‌లోనే హర్షల్ ఈ ఫీట్ సాధిస్తే.. తన మీద కూడా ఒత్తిడి తగ్గి రెట్టించిన ఉత్సాహంతో మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది.
Also Read: డేవిడ్ వార్నర్ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్ మంజ్రేకర్ అనుమానం!
Also Read: ఆఖరి బంతికి సిక్స్..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి
Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం