GM Gukesh: భారత చెస్ కు కొత్త రాజు - విష్షూ ఆధిపత్యానికి చెక్, గురువును మించిన గుకేశ్
మూడు దశాబ్దాల పాటు భారత చదరంగ క్రీడకు కర్త, కర్మ, క్రియగా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ శిష్యుడు, యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ తాజాగా తన గురువునే అధిగమించాడు.
GM Gukesh: భారత్‌లో చెస్ గురించి తెలిసిన ఎవరికైనా ఈ క్రీడలో అగ్రస్థానంలో ఉన్న పేరు చెప్పమంటే టక్కున గుర్తొచ్చేది విశ్వనాథన్ ఆనంద్. మూడున్నర దశాబ్దాలుగా భారత చదరంగానికి కర్త, కర్మ, క్రియగా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ ఆధిపత్యానికి త్వరలోనే చెక్ పడబోతోంది. విష్షూ (ఆనంద్ ముద్దుపేరు)కు చెక్ పెట్టబోయేది మరెవరో కాదు.. అతడి అకాడమీలో శిఖ్షణ పొందుతూ, ఆనంద్‌నే మెంటార్‌గా నియమించుకున్న గుకేశ్. 17 ఏళ్ల ఈ చెన్నై చిన్నోడు తాజాగా ఫిడే ర్యాంకింగ్స్‌లో ఆనంద్‌ను అధిగమించడం విశేషం.
గడిచిన మూడున్నర దశాబ్దాలు (36 ఏళ్లు)గా ఫిడే రేటింగ్స్‌లో టాప్ - 10లో ఉంటున్న ఆనంద్‌ను తాజాగా గుకేశ్ అధిగమించాడు. ఫిడే లైవ్ రేటింగ్స్ ప్రకారం ఆనంద్ 2,754 రేటింగ్ పాయింట్స్‌తో టాప్-10 లో పదో స్థానంలో ఉండగా.. 17 ఏళ్ల గుకేశ్.. 2,755 రేటింగ్ పాయింట్స్‌తో తొమ్మిదో స్థానానికి చేరాడు. ఇద్దరి మధ్య తేడా ఒక్క పాయింటే అయినా ప్రస్తుతం బాకులో జరుగుతున్న వరల్డ్ కప్‌లో గుకేశ్ తన పాయింట్లను మరింత పెంచుకునే అవకాశముంది. వరల్డ్‌కప్‌లో భాగంగా రెండో రౌండ్‌లో గుకేశ్.. అజర్‌బైజాన్‌కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్‌పై గెలవడంతో అతడికి 2.5 రేటింగ్ పాయింట్లు యాడ్ అయ్యాయి. దీంతో గుకేశ్.. విష్షూను అధిగమించాడు.
ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్.. ఈ నెలాఖరున టాప్-10లో ఉండటం కష్టమే. యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ జోరుతో విష్షూ ర్యాంక్ టాప్-10 నుంచి పడిపోనుంది. సెప్టెంబర్ 1న ఫిడే అధికారిక రేటింగ్ జాబితాను విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ రేటింగ్స్‌లో కార్ల్‌సన్.. 2,838 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
Gukesh D won again today and has overcome Viswanathan Anand in live rating!
— International Chess Federation (@FIDE_chess) August 3, 2023
There is still almost a month till next official FIDE rating list on September 1, but it's highly likely that 17-year-old will be making it to top 10 in the world as the highest-rated Indian player!… pic.twitter.com/n3I2JPLOJQ
విష్షూ 1991లో తొలిసారిగా ఫిడే ర్యాంకింగ్స్‌లో టాప్ - 10లోకి వచ్చాడు. అంతకంటే ముందు నాలుగేళ్లుగా భారత్‌లో అత్యధిక రేటింగ్ కలిగిన ఆటగాడిగా ఉన్నా 91 నుంచే ఫిడే ర్యాంకింగ్స్‌లో అతడి ఆధిపత్యం మొదలైంది. ఇన్నేళ్ల కాలంలో ఫిడే ర్యాంకులలో విష్షూతో పాటు టాప్ - 10 లో నిలిచిన భారత ఆటగాళ్లలో గుకేశ్ రెండోవాడు. 2016లో ఆంధ్రా చెస్ ఆటగాడు పెండ్యాల హరికృష్ణ కూడా ఈ ఫీట్ సాధించాడు.
ఏడాదిన్నరలోనే..
2017 వరకూ చెన్నైలోని విష్ణు చెస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న గుకేశ్.. 2019లో గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు. అత్యంత పిన్నవయస్కుడైన గ్రాండ్ మాస్టర్‌గా కూడా రికార్డులకెక్కాడు. కరోనా సమయంలో గుకేశ్.. ఆనంద్ చెస్ అకాడమీలో చేరాడు. అక్కడ గుకేశ్ మరింత రాటుదేలాడు. గతేడాది ఏప్రిల్‌లో ఫిడే ర్యాంకింగ్స్‌లో టాప్ - 100లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఏడాదిన్నర కాలంలోనే టాప్ - 10 లోకి చేరుకోవడం గమనార్హం. కాగా తన శిష్యుడిపై విష్షూకు సంపూర్ణ నమ్మకముంది. ప్రపంచకప్‌కు ముందు ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏడాదిన్నరకాలంగా గుకేశ్ అత్యద్భుతంగా రాణిస్తున్నాడు. తన ప్రతిభతో నన్ను మాత్రమే కాకుండా ప్రపంచ చెస్ అభిమానులను కూడా అలరిస్తోంది. చెస్ పట్ల అతడికున్న అంకితభావం, ఆట పట్ల నిబద్ధత, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే నైజం ఇలాగే కొనసాగాలని నేను ఆశిస్తున్నా. గుకేశ్ సత్తాపై నాకు నమ్మకముంది..’ అని ఆనంద్ చెప్పడం విశేషం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial