Zero Gravity foot ball match: జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్.. గిన్నిస్ బుక్ లో ప్లేస్
Zero Gravity foot ball match:సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తులో జీరో గ్రావిటీలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స లో చోటు సంపాదించారు. ఆ ఆటను మీరూ చూసేయండి.
Zero Gravity foot ball match: జీరో గ్రావిటీ అంటే గాలిలో తేలుతాం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వాతావరణంలో నిలబడడం చాలా కష్టమైన పని. అయితే అలాంటి జీరో గ్రావిటీలో ఓ టీం ఫుట్ బాల్ మ్యాచ్ ఆడి గిన్నిస్ రికార్డులకెక్కింది. గాల్లో ఫుట్ బాల్ ఆడడం ఏంటి? దానికి గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు దక్కడమేంటీ అనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి. మీకే అర్థమవుతుంది.
ఔట్ ఆఫ్ వరల్డ్ పేరిట ఒక ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహించారు. అది మాములు కోర్టులో కాదు. భూమికి చాలా చాలా ఎత్తులో, జీరో గ్రావిటీలో. ఇందులో భాగంగా ఏడుగురు ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లారు. జీరో గ్రావిటీలోకి వెళ్లాక విమానం లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 75 స్క్వేర్ మీటర్ల పిచ్ పై వారు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు.
ఈ ఆటగాళ్లలో పోర్చుగీస్ స్టార్ ఫుట్ బాలర్ లూయిస్ ఫిగో ఉన్నారు. ఇంకా మిడిల్ ఈస్ట్, యూరోప్, లాటిన్ అమెరికాలకు చెందిన పురుష, మహిళా ఫుట్ బాలర్లు పాల్గొన్నారు. ఈ ఏడుగురు రెండు జట్లుగా విడిపోయారు. మొదటి జట్టు రెడ్ టీమ్. రెండోది టీమ్ ఎల్లో. రెడ్ టీమ్ కు ఫిగో నాయకత్వం వహించారు. ఆ జట్టు తరఫున ఫిగో కళ్లు చెదిరే గోల్ చేశారు. ఈ మ్యాచ్ లో రెడ్ టీమ్ 2-1 తేడాతో టీమ్ ఎల్లోపై విజయం సాధించింది. జీరో గ్రావిటీలో తొలిసారి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన ఈ ఆటగాళ్లు గిన్నీస్ పుస్తకంలో చోటు సంపాదించారు. ప్రస్తుతం ఈ మ్యాచుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.