అన్వేషించండి
Advertisement
Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో కొనసాగుతున్న సంచలనాలు
Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్రశ్రేణి ఆటగాళ్ల నిష్క్రమణ కొనసాగుతోంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024)లో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్రశ్రేణి ఆటగాళ్ల నిష్క్రమణ కొనసాగుతోంది. మహిళల్లో మూడో సీడ్ రిబకినా, అయిదో సీడ్ పెగులా, పురుషుల్లో ఎనిమిదో సీడ్ రూన్ రెండోరౌండ్లోనే ఓడిపోయారు. మహిళల్లో టాప్ సీడ్ స్వైటెక్, పురుషుల్లో రెండోసీడ్ అల్కరాస్ కష్టపడి ముందంజ వేశారు.
గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్ కజకిస్థాన్‌కు చెందిన మూడో సీడ్ ఎలీనా రిబకినా రెండో రౌండ్‌లోనే పరాజయం పాలైంది. రష్యాకు చెందిన బ్లింకోవా చేసితో రిబకినా ఓడిపోయింది. రెండో రౌండ్లో బ్లింకోవా 6-4, 4-6, 7-6 (22-20)తో రిబకినాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను చేజార్చుకున్నా.. రెండో సెట్లో రిబకినా పుంజుకుంది. పదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి సెట్ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. కానీ మూడో సెట్లో ఆమెకు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ తప్పలేదు. దీంతో సెట్ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లోనూ పోటీ నువ్వానేనా అన్నట్లు సాగి స్కోర్లు సమమవుతూ వెళ్లాయి. 20-20 వద్ద వరుసగా రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్న బ్లింకోవా.. సెట్, మ్యాచ్ గెలిచి రిబకినా పోరాటానికి తెరదించింది.
సుదీర్ఘ టైబ్రేకర్
ఎలెనా రిబకినా -అనా బ్లింకోవా మధ్య రెండో రౌండ్ మ్యాచ్ మూడో సెట్ టైబ్రేకర్ మహిళల గ్రాండ్‌స్లామ్‌ల్లో సుదీర్ఘంగా సాగిందిగా రికార్డులకెక్కింది. ఈ టైబ్రేకర్‌లో ఇద్దరూ కలిసి 42 పాయింట్లు స్కోరు చేశారు. ఈ మ్యాచ్‌లో బ్లింకోవా 6-4, 4-6, 7-6 (22-20)తో రిబకినాను ఓడించింది.
కష్టంగా మూడో రౌండ్‌కు స్వైటెక్
టాప్‌సీడ్ , పోలెండ్‌కు చెందిన ఇగా స్వైటెక్ కష్టంగా మూడో రౌండ్ చేరింది. రెండో రౌండ్లో ఆమె 6-4, 3-6, 6-4తో అమెరికాకు చెందిన డానియలె కొలిన్స్‌పై నెగ్గింది. తొలి సెట్‌ను గెలిచి జోరు మీద కనిపించిన స్వైటెక్ రెండో సెట్లో తడబడింది. నిర్ణయాత్మక మూడో సెట్ నువ్వానేనా అన్నట్లు సాగింది. 5-4తో ఆధిక్యంలో ఉన్నప్పుడు పదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసిన స్వైటెక్ 6-4తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. అయిదో సీడ్ పెగులా (అమెరికా) 4-6, 2-6తో అన్‌సీడెడ్ క్లారా బరెల్ (ఫ్రాన్స్) చేతిలో కంగుతింది. గంట 10 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో 26 అనవసర తప్పిదాలు చేసిన పెగులా ఓటమి కొనితెచ్చుకుంది.
అల్కరాస్ చెమటోడ్చి
స్పెయిన్ కెరటం కార్లోస్ అల్కరాస్ కష్టంగా ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండోసీడ్ అల్కరాస్ 6-4, 6-7 (3-7), 6-3, 7-6 (7-3)తో సొనెగో (ఇటలీ)పై నెగ్గాడు. ఎనిమిదో సీడ్ రూన్ (డెన్మార్క్) 6-7 (4-7), 4-6, 6-4, 3-6తో వైల్‌కార్డ్ ఎంట్రీ కజాక్స్ (ఫ్రాన్స్) చేతిలో కంగుతిన్నాడు. జ్వెరెవ్ (జర్మనీ) 7-5, 3-6, 4-6, 7-6 (7-5), 7-6 (10-7)తో క్లెయిన్ (స్లొవేకియా)పై, దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 6-2, 4-6, 6-4తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి మూడో రౌండ్ చేరారు. రష్యా స్టార్ డానియెల్ మెద్వెదెవ్ చెమటోడ్చి మూడో రౌండ్ చేరాడు. అయిదుసెట్ల పోరులో తొలి రెండు సెట్లు కోల్పోయి కూడా అతడు పోరాడి విజయాన్ని అందుకున్నాడు. నాలుగు గంటలకు పైగా సాగిన రెండో రౌండ్లో మూడోసీడ్ మెద్వెదెవ్ 3-6, 6-7 (1-7), 6-4, 7-6 (7-1), 6-0తో ఎమిల్ రుసువోరి (ఫిన్లాండ్)పై కష్టం మీద గట్టెక్కాడు. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం రా.3.40 వరకు సాగడం విశేషం.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion