CWG 2022: పసిడి పంచ్‌లు! బాక్సింగ్‌లో 2 గోల్డ్ మెడల్స్ - ఫైనల్‌కు పీవీ సింధు
CWG 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. కొద్ది వ్యవధిలోనే రెండు స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు కనీసం రజతం ఖాయం చేసింది.
CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. రెజ్లర్లు ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. కొద్ది వ్యవధిలోనే రెండు స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. మహిళల విభాగంలో నీతూ గాంగాస్ (48 కేజీలు), పురుషుల విభాగంలో అమిత్ పంగాల్ (51 కేజీలు) పడిసి పతకాలు ముద్దాడారు. బ్యాడ్మింటన్లో పీవీ సింధు కనీసం రజతం ఖాయం చేసింది. సెమీస్‌లో యీ జియా మిన్‌ను 21-19, 21-17 తేడాతో ఓడించింది.
నీతూ అరంగేట్రం అదుర్స్
ఆదివారం తొలి స్వర్ణం కొల్లగొట్టింది నీతూ గాంగాస్. అరంగేట్రం కామన్వెల్త్ క్రీడల్లోనే తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె రెండు సార్లు ప్రపంచ యూత్ మెడలిస్ట్ కావడం గమనార్హం. అదే ఊపునూ ఇక్కడా కొనసాగించింది. ఫైనల్లో జేడ్స్ రెస్టాన్‌ను 5-0తో చిత్తు చేసి లిస్ట్-ఏ బాక్సర్ల జాబితాలో చేరిపోయింది. బౌట్ ఆరంభం నుంచే ఆమె ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. తొలి రౌండ్లోనే 4-1తో న్యాయ నిర్ణేతలను మెప్పించింది. రెండో రౌండ్లోనూ ఆమె దూకుడుగానే ఆడింది. జేడ్స్ నుంచి ప్రతిఘటన ఎదురైనా వెరవలేదు. దాంతో రెండో రౌండ్లోనూ 4-1తో నెగ్గింది.
🥇NITU WINS GOLD!! 🤩
— SAI Media (@Media_SAI) August 7, 2022
2️⃣time World Youth medalist Nitu Ghanghas wins 🥇at #CommonwealthGames2022 on debut
With this win, the pugilist has won a spot on the list of #Boxing A-listers🤩
Brilliant!!
Let's #Cheer4India#India4CWG2022 pic.twitter.com/PvZ4qVWJuW
అమిత్ 'లే పంగా'!
బర్మింగ్‌హామ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచీ అమిత్ పంగాల్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టే అతడూ రాణించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్ బాక్సర్ మ్యాక్ డొనాల్డ్‌తో తలపడ్డాడు. తొలి రౌండ్లో తన డిఫెన్స్‌తో ప్రత్యర్థి పంచ్‌లను బ్లాక్ చేశాడు. ఆపై ఉన్నట్టుండి ఒక్కసారిగా పిడిగుద్దులతో విరుచుకుపడి 5-0తో న్యాయ నిర్ణేతలను మెప్పించాడు. రెండో రౌండ్ ఆరంభంలోనే అమిత్ విసిరిన పంచ్‌కు ప్రత్యర్థి కుడి కంటిపై గాయమైంది. దాంతో 2 నిమిషాలు మ్యాచ్ ఆపేశారు. విరామం తర్వాతా డొనాల్డ్ పుంజుకోలేదు. అమిత్ వరుస పంచ్‌లతో 4-1 స్కోర్ సాధించాడు. మొత్తంగా 5-0తో బంగారం పట్టేశాడు.
🥇GOLD FOR PANGHAL🥇
— SAI Media (@Media_SAI) August 7, 2022
World Class Effort from @Boxerpanghal🥊🤩 as he upgrades from silver in 2018 CWG to GOLD🥇at #CommonwealthGames2022
Proud of you Champ!!#Cheer4India 🇮🇳#India4CWG2022 🤟 pic.twitter.com/iN4LBobyEW
సింధూ.. గోల్డ్ పోరుకు!
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్ చేరుకుంది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో 21-19, 21-17 తేడాతో సింగపూర్ షట్లర్ యీ జియా మిన్‌పై విజయం సాధించింది. కేవలం 49 నిమిషాల్లోనే ప్రత్యర్థి పని పట్టేసింది. ఆరంభంలో ఆమె కాస్త తడబడటంతో ప్రత్యర్థి 8-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. విరామం తర్వాత 19-12తో మరింత పైచేయి సాధించింది. ఈ క్రమంలో సింధు వరుస పాయింట్లతో మిన్‌ను అడ్డుకుంది. 21-19తో తొలి గేమ్ గెలిచింది. అదే లయ కొనసాగించి రెండో గేమ్‌ను సునాయాసంగా కైవసం చేసుకుంది.
SINDHU INTO THE FINAL!! 🤩
— SAI Media (@Media_SAI) August 7, 2022
PV Sindhu defeated Yeo Jia Min (Singapore) 21-19/21-17. With this win she has entered the Finals🤩
Go For GOLD!! 🥇#Cheer4India 🇮🇳#India4CWG2022 pic.twitter.com/deTOYzyLcy