Kohli in 2022: లవ్‌యూ 2022! మా కింగ్ కోహ్లీని తిరిగిచ్చావ్!
Kohli in 2022: మంచినీళ్ల ప్రాయంగా బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ మూడేళ్లుగా పరుగుల కరవుతో విరహ వేదన చెందాడు. కవ్వించే ప్రత్యర్థిపై బెబ్బులిలా విరుచుకుపడే అతడే దేవుడా! నాకే ఎందుకిలా అవుతోందని ఆకాశం వైపు చూశాడు.
Kohli in 2022: అతడు క్రీజులో అడుగు పెడితే పరుగుల వరదే! అతడు మైదానంలో ఫీల్డింగ్ చేస్తుంటే ప్రత్యర్థులకు వణుకే! అతడు బ్యాటు అందుకున్నాడంటే సెంచరీల మోతే! అందుకే అంతర్జాతీయ క్రికెట్లో అతడి పేరు విరాట్ కోహ్లీ! అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు కింగ్!
అంతర్జాతీయ క్రికెట్లో ఈ తరం డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఎవరంటే వినిపించేది విరాట్ పేరే. మంచినీళ్ల ప్రాయంగా బ్యాటింగ్ చేసే అతడు మూడేళ్లుగా పరుగుల కరవుతో విరహ వేదన చెందాడు. శక్తికి మించి ప్రాక్టీస్ చేసినా సెంచరీ అందుకోలేకపోయాడు. కవ్వించే ప్రత్యర్థిపై బెబ్బులిలా విరుచుకుపడే అతడే దేవుడా! నాకే ఎందుకిలా అవుతోందని ఆకాశం వైపు చూశాడు.
ఇక ఫేక్ ఇంటెన్సిటీ అవసరం లేదని గ్రహించాడు! కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉండిపోయాడు. కుటుంబంతో సమయం గడిపి సాంత్వన పొందాడు. పదేళ్లలో తొలిసారి చేత్తో బ్యాటు పట్టుకోకుండా విశ్రాంతి తీసుకున్నాడు. పూర్తిగా పునరుత్తేజంతో క్రీజులో అడుగెట్టాడు. సెంచరీతో గర్జించి ఫామ్ అందుకున్నాడు. 2022 ఏడాది అతడి కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయేలా చూసుకున్నాడు.
మళ్లీ తిరిగొచ్చాడు!
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2022లో మొత్తం 36 మ్యాచులు ఆడాడు. 39.51 సగటు, 89.31 స్ట్రైక్‌రేట్‌తో 1304 పరుగులు సాధించాడు. 122* అత్యధిక స్కోరు. రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు, 128 బౌండరీలు, 29 సిక్సర్లు బాదేశాడు. అంతకు ముందు రెండేళ్లతో పోలిస్తే ఈ గణాంకాలు కాస్త మెరుగే. ఎందుకంటే 2021లో 24 మ్యాచుల్లో 964, 2020లో 22 మ్యాచుల్లో 842 పరుగులే చేశాడు. మొత్తానికి మూడేళ్ల తర్వాత సెంచరీ అందుకొని మురిశాడు. తాను ఊహించని విధంగా టీ20 ప్రపంచకప్‌లో శతకం బాదేసి రికీ పాంటింగ్ రికార్డు సమం చేశాడు. ఆపై బంగ్లాదేశ్‌పై వన్డేల్లో అందుకొని సచిన్ తెందూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీల వీరుడిగా ఘనత పొందాడు.
ఇష్టమైన ఫార్మాట్లో సగటే!
ఈ ఏడాది టెస్టు క్రికెట్లో విరాట్ ప్రదర్శన అంతంత మాత్రమే అనుకోవాలి. ఆడిందే 5 మ్యాచులు. 27.62 సగటు, 40.32 స్ట్రైక్‌రేట్‌తో 221 రన్స్ చేశాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. జనవరిలో అత్యధిక స్కోరు చేసిన అతడు క్రమంగా ఫామ్ కోల్పోయాడు. 2022లో టీమ్‌ఇండియా తక్కువ వన్డేలే ఆడింది. కాగా విరాట్ 11 వన్డేల్లో 27.45 సగటు, 87.03 స్ట్రైక్‌రేట్‌తో 302 రన్స్ చేశాడు. విచిత్రంగా 8 వన్డేల్లో స్కోరు 19 దాటలేదు. అయితే బంగ్లాపై ఆఖరి వన్డేలో సెంచరీతో ఏడాదిని ముగించాడు. నిజం చెప్పాలంటే తనకిష్టమైన రెండు ఫార్మాట్లలో అతడిది సగటు ప్రదర్శనే.
టీ20 దుమ్ము దులిపేశాడు!
టీ20 ఫార్మాట్ ప్రకారం విరాట్ కోహ్లీకి 2022 ఒక ఫ్రూట్‌ఫుల్ ఇయర్ అనుకోవచ్చు. పొట్టి క్రికెట్లో కెరీర్లో తొలిసారి అత్యధిక పరుగులు చేశాడు. 20 మ్యాచుల్లో 55.78 సగటు, 138.23 స్ట్రైక్‌రేట్‌తో 781 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు బాదేశాడు. అంతకు ముందు 2016లో 15 మ్యాచుల్లో 641 రన్స్ సాధించాడు. ఈ ఏడాది ఆసియాకప్‌లో విరాట్ 276 రన్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఆఖరి మ్యాచుల్లో అఫ్గాన్‌పై 122 పరుగులతో అజేయంగా నిలిచిన తీరును ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడి బ్యాటింగ్ తన కెరీర్‌కే హైలైట్. 6 మ్యాచుల్లో 98.66 సగటు, 136 స్ట్రైక్‌రేట్‌తో 296 రన్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. వరుసగా 82*, 62*, 12, 64*, 26, 50తో అదరగొట్టాడు. ఇక తొలి మ్యాచులో పాకిస్థాన్‌పై ఓడిపోయే మ్యాచులో కోహ్లీ కొట్టిన షాట్లు కన్నుల పండువగా మారాయి. ఐపీఎల్ ప్రదర్శన అంతంత మాత్రమే!
మొత్తంగా 2022 ఏడాది మన వింటేజ్ విరాట్ కోహ్లీని మనకు తిరిగిచ్చింది!