(Source: ECI/ABP News/ABP Majha)
WTC Final 2023: సాహాకు షాకిచ్చి ఇషాన్‌పై అంత ఇష్టమెందుకు? - సర్ఫరాజ్ కంటే గొప్ప రికార్డు కూడా లేదే!
ఐపీఎల్ -16 ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం జట్టును సవరించింది.
WTC Final 2023: పదేండ్ల నుంచి అందని ద్రాక్షలా మారుతున్న ఐసీసీ ట్రోఫీని ఈ ఏడాది దక్కించుకునేదిశగా అడుగులు వేస్తున్న భారత జట్టు.. వచ్చే నెల 7-11 మధ్య ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో తలపడనున్నది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో కెఎల్ రాహుల్ గాయంతో జట్టులో స్వల్ప మార్పులు చేసింది. రాహుల్ స్థానాన్ని ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భర్తీ చేయనున్నాడు. సీనియర్ వృద్ధిమాన్ సాహాతో పాటు దేశవాళీలో మరికొంతమంది ఔత్సాహిక క్రికెటర్లు రాణిస్తున్నా వారిని పక్కనబెట్టి మరీ ఇషాన్ ను ఎంపిక చేయడానికి కారణమేంటి..?
సాహా ఎందుకు వద్దు..?
రాహుల్ గాయం తర్వాత అతడి రిప్లేస్‌మెంట్‌గా గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సాహాను ఎంపిక చేయాలని చాలా మంది నెటిజన్లు బీసీసీఐని కోరారు. ఐపీఎల్‌లో గత సీజన్‌తో పాటు ప్రస్తుత సీజన్ లో కూడా సాహా నిలకడగా ఆడుతున్నాడు. తన సహజ శైలికి భిన్నంగా అవతలి ఎండ్ లో శుభ్‌మన్ గిల్ ఉన్నా తన మెరుపు విన్యాసాలతో అలరిస్తున్నాడు. కానీ సాహా ఎంత ఆడినా ఐపీఎల్ దాటి రాలేడన్నది బహిరంగ వాస్తవం.
గతేడాది బీసీసీఐ ఈ విషయం చెప్పకనే చెప్పింది. స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్ కు ముందే ఇషాంత్ శర్మ, సాహా వంటి ఆటగాళ్లకు బీసీసీఐ పెద్దలు.. తాము యువకులను ప్రోత్సహించాలని భావిస్తున్నామని తేల్చి చెప్పారు. రిషభ్ పంత్ కు బ్యాకప్ గా యువ వికెట్ కీపర్ ను ప్రోత్సహించనున్నట్టు 38 ఏండ్ల సాహాకు వివరించారు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు ఎంపికలో కూడా బీసీసీఐ దానినే ఫాలో అయింది.
NEWS - KL Rahul ruled out of WTC final against Australia.
— BCCI (@BCCI) May 8, 2023
Ishan Kishan named as his replacement in the squad.
Standby players: Ruturaj Gaikwad, Mukesh Kumar, Suryakumar Yadav.
More details here - https://t.co/D79TDN1p7H #TeamIndia
సర్ఫారాజ్, అభిమన్యు ఈశ్వరన్ లకు నిరాశే..
రెండో వికెట్ కీపర్ గా కాకుండా రాహుల్ స్థానాన్ని ఒక నిఖార్సైన బ్యాటర్‌తో భర్తీ చేయించాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చాలా మంది దేశవాళీలో రాణిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (ఐపీఎల్ లో ఢిల్లీకి ఆడుతున్నాడు), బెంగాల్ రంజీ టీమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకోవాలని సూచించారు. కానీ ఎప్పటిలాగే బీసీసీఐ వీరికి నిరాశే మిగిల్చింది. వాస్తవానికి పరిమిత ఓవర్లలో దూకుడుగా ఆడతాడు.. వన్డేలలో డబుల్ సెంచరీ ఉందనే ట్యాగ్ తప్ప ఇషాన్ కు టెస్టులలో ఆడిన అనుభవం లేదు.
అంతేగాక సర్ఫరాజ్, అభిమన్యులతో పోల్చితే దేశవాళీలో అతడికి అంత గొప్ప రికార్డు కూడా ఏమీ లేదు. ఐపీఎల్ ప్రదర్శనలో కొలమానం అయితే.. ప్రస్తుత సీజన్ లో కాస్త ఫర్వాలేదనిపిస్తున్నా గత సీజన్ లో మాత్రం ఇషాన్ ప్రదర్శనలు దారుణంగా ఉన్నాయి. కనీసం సబ్ స్టిట్యూట్ లుగా కూడా ఈ ఇద్దరికీ చోటు దక్కకపోవడం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. రుతురాజ్ గైక్వాడ్ ను సబ్‌స్టిట్యూట్ గా చేర్చినా అతడిని ఆడించేది అనుమానమే..
Do you think Sarfaraz Khan's domestic heroics went unnoticed in the 2023 WTC Final squad selection?#WTCFinal #IshanKishan #SarfarazKhan pic.twitter.com/PHWrNK0q7W
— CricTracker (@Cricketracker) May 9, 2023
ఇషానే ఎందుకు..?
డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరిగే ది ఓవల్ ఫ్లాట్ పిచ్. ఇక్కడ స్పిన్నర్ల కంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపగలరు. ఇది ఇషాన్ కు లాభించేదే. స్పిన్ ఆడటంలో ఇబ్బందిపడే ఇషాన్.. పేస్ బౌలింగ్ ను మాత్రం దూకుడుగా ఎదుర్కోగలడు. అదీగాక పంత్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ కు గాయంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ వీక్ గా మారింది. ముఖ్యంగా మిడిలార్డర్ లో పుజారా, రహానే తర్వాత స్పెషలిస్టు బ్యాటర్ లేడు. ఒకవేళ తుది జట్టులో చోటు దక్కితే ఇషాన్ ఇందుకు సరైన ఎంపిక అవుతాడు. మరి ఫైనల్ లెవన్ లో భరత్ - ఇషాన్ లలో ఎవరికి అవకాశం ఇస్తారు..? ఇద్దరిలో ఎవరు మిడిలార్డర్ లో కీలకంగా మారుతారు..? అన్నది త్వరలోనే తేలనుంది.