WPL final : నేడే WPL టైటిల్ ఫైట్ , విజేతగా నిలిచేదెవరో?
WPL final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తుది పోరుకు ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈసారి ఎలాగైనా కప్పును ఒడిసిపట్టాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.
Delhi Capitals, RCB chase first franchise league title: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) తుది పోరుకు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈసారి ఎలాగైనా కప్పును ఒడిసిపట్టి తొలిసారి ఆ ఘనత సాధించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. అభిమానులను అలరించిన డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో ఆఖరి అంకానికి వేళైంది. ఆదివారం ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏ పురుషుల జట్టూ విజేతగా నిలవలేదు. ఇప్పుడు అమ్మాయిల్లో ఏ జట్టు జయకేతనం ఎగరేస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. నిరుడు తుదిపోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. ఫైనల్లో ఆర్సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వనుంది. నిరుడు రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఢిల్లీ.. ఈసారి ట్రోఫీ వదలొద్దనే కసితో ఉంది. ఆర్సీబీ కప్పు కొట్టాలంటే ఢిల్లీ ఓపెనర్లు మేగ్ లానింగ్, షఫాలీ వర్మతో పాటు ఫామ్‌లో ఉన్న అలిసే క్యాప్సేల దూకుడుకు బ్రేక్ వేయాలి.
పెర్రీపైనే భారమంతా...
డిఫెండింగ్ చాంపియన్ ముంబైని వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడించిన బెంగళూరు.. ఈసారి అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ఎలీస్ పెరీపై బెంగళూరు భారీ ఆశలు పెట్టుకుంది. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన పెరీ ఫైనల్లోనూ అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్‌ల నుంచి సహకారం లభిస్తే బెంగళూరు విజయం అంత కష్టమేమీ కాకపోవచ్చు. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్‌లు ఆశించిన మేర రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గతేడాది ముంబై జోరుతో రన్నరప్‌గా సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఈ టోర్నీలో ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్‌కు దూసుకొచ్చింది.
తొలిసారి ఫైనల్‌కు బెంగళూరు
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఫైనల్ ఆడుతోంది. ఐపీఎల్‌లోనూ మూడుసార్లు ఆఖరి మెట్టుపై బోల్తా పడిన ఆర్సీబీ.. ఈసారి కప్పు కొట్టాలని కోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదరుచూస్తున్నారు. బెంగళూరు గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ గెలిచిన తొలి కెప్టెన్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టిస్తుంది. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫేవరేట్. క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే (Anil Kumble), డానియల్ వెటోరీ(Daniel Vettori), విరాట్ కోహ్లీ(Virat Kohli)లు ఆర్సీబీని ఫైనల్‌కు తీసుకెళ్లారు. కానీ, మూడుసార్లు బెంగళూరు ఫైనల్లో చేతులేత్తేసింది. ఐపీఎల్‌లో దురదృష్టానికి కేరాఫ్ అయిన ఆర్సీబీ.. మహిళల ప్రీమియర్ లీగ్‌లో చాంపియన్‌గా నిలుస్తుందా? లేదా? అన్నది చూడాలి.
జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్ కప్, జెస్ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్‌హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్.