IND vs AUS Final 2023: ఆసీస్ తో ఫైనల్ కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ - రోహిత్ సేనకు అంపైర్ గండం!
World Cup 2023 final Richard Kettleborough: టీమిండియా, ఆస్ట్రేలియా ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ కెటిల్ బరో, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.
World Cup 2023 IND vs AUS final : ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ప్రపంచంలోని అతిపెద్దదైన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా, టీమిండియా తలపడనున్నాయి. అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన అంపైర్, మేనేజ్ మెంట్ అఫీషియల్స్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఫైనల్ కు ముందే భారత అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ద్యావుడా భారత్ కు మళ్లీ పరీక్ష పెట్టావా అనుకుంటున్నారు.
టీమిండియా, ఆస్ట్రేలియా ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ కెటిల్ బరో, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. జోయల్ విల్సన్ థర్డ్ అంపైర్ కాగా, మ్యాచ్ రిఫరీగా ఆండీ ఫైక్రాఫ్ట్ పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ అఫీషియల్స్ జాబితా చూసిన భారత అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అందుకు కారణంగా, భారత్ కు బ్యాడ్ లక్ గా భావించే రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా వ్యవహరించనుండటమే అందుకు కారణం. నాకౌట్ అయిన న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ కు రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయడం లేదని భారత ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారంటే ఆయన టీమిండియాకు అంత అచ్చిరాడని చెప్పవచ్చు. కానీ ఫైనల్ మ్యాచ్ రూపంలో ఇంగ్లాండ్ అంపైర్ కెటిల్ బరో రోహిత్ సేనకు అగ్నిపరీక్ష పెట్టాడంటూ భారత క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రతిసారి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. భారత్ ఓడిన 2014లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ తో పాటు, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ కు రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా వ్యవహరించారని తెలిసిందే. అది అంతటితో ఆగలేదు.. 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ కు, 2021లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తో పాటు ఈ ఏడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అంపైర్ కెటిల్ బరో బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా గత దశాబ్దకాలం నుంచి రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా వ్యవహరించిన నాకౌట్ మ్యాచ్ లలో అన్నింటా భారత్ ఓటమిపాలైంది.
2019 వన్డే వరల్డ్ కప్ లో సెమీఫైనల్లో ఎంఎస్ ధోనీ రనౌట్ తో పాటు అంపైర్ కెటిల్ బరో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ సైతం భారత అభిమానులు మరిచిపోలేరు. మొన్న సెమీస్ లో కెటిల్ బరో లేరని భారత్ ఫైనల్ చేరుతుందని ఆశించినట్లుగానే కివీస్ ఓడించి టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో రోహిత్ సేన నిలిచింది. కానీ ఫైనల్లో ఈ ఇంగ్లాండ్ రూపంలో భారత్ కు మరోసారి గండం పొంచి ఉందని క్రికెట్ ప్రేమికులు టెన్షన్ పడుతున్నారు. ఈసారి ఏం జరిగినా సరే, ఏది ఏమైనా టీమిండియా ముచ్చటగా మూడోసారి వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడుతుందని మాజీలతో పాటు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.