Women's IPL 2023: మహిళల ఐపీఎల్ వేలం కనీస ధరలు ఫిక్స్! అబ్బాయిలతో పోలిస్తే మరీ ఇంత..!
Women's IPL 2023: మహిళల ఐపీఎల్ (WIPL) పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే మీడియా హక్కుల వేలానికి టెండర్లు పిలిచారు. తాజాగా క్రికెటర్ల కనీస ధరలను నిర్ణయించారని తెలిసింది.
Women's IPL 2023:
మహిళల ఐపీఎల్ (WIPL) పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే మీడియా హక్కుల వేలానికి టెండర్లు పిలిచారు. తాజాగా క్రికెటర్ల కనీస ధరలను నిర్ణయించారని తెలిసింది. రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఐదు విభాగాలుగా విభజించారని సమాచారం. అమ్మాయిలు వేలంలో పేర్లు నమోదు చేసుకొనేందుకు జనవరి 26 చివరి తేదీ. ఈమేరకు బీసీసీఐ రాష్ట్ర సంఘాలకు మార్గదర్శకాలు పంపించింది.
ఇప్పటికే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసిన అమ్మాయిలు, సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఉన్నవారు రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షల కనీస ధరల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. అరంగేట్రం చేయని క్రికెటర్లు రూ.10 లక్షలు, రూ.20 లక్షల విభాగాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. మహిళల ఐపీఎల్‌లో స్థానిక క్రికెటర్లు ఎక్కువ పాల్గొనేలా చూడాలని రాష్ట్ర సంఘాలను బీసీసీఐ ఆదేశించింది. విదేశీ క్రికెటర్లకూ ఈ ఐదు విభాగాలే ఉంటాయని తెలిపింది.
మహిళల ఐపీఎల్ క్రికెటర్ల వేలం తేదీని బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. ఫిబ్రవరి 11న వేలం ఉంటుందని తెలిసింది. మార్చి 6 నుంచి 26 వరకు మహారాష్ట్రలోని వేదికల్లో మ్యాచులు నిర్వహిస్తారని సమాచారం. వేలంలో నమోదు చేసుకొనే క్రికెటర్లు తమ వ్యక్తిగత స్పాన్సర్లను ధ్రువీకరించాల్సి ఉంటుంది. వేలంలో క్రికెటర్ల ఏజెంట్ల జోక్యాన్ని బీసీసీఐ నిరాకరించింది.
'బీసీసీఐ కేవలం రాష్ట్ర సంఘాలతోనే డీల్ చేస్తుంది. క్రికెటర్ల ఏజెంట్లు, మేనేజర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమాచారం ఇవ్వదు. ఈ నిబంధనలు పాటించడంలో విఫలమైతే వెంటనే వేలం ముసాయిదా నుంచి పేర్లను తొలగిస్తాం' అని బీసీసీఐ రాష్ట్ర సంఘాలకు తెలిపింది.
మహిళల ఐపీఎల్ (WIPL) మీడియా హక్కులకు మంచి స్పందన లభించింది. పదికి పైగా కంపెనీలు టెండర్ పత్రాలను తీసుకున్నాయని తెలిసింది. డిస్నీ స్టార్, సోనీ నెట్‌వర్క్, వయాకామ్ 18తో పాటు అమెజాన్ ప్రైమ్, ఫ్యాన్ కోడ్, టైమ్స్ ఇంటర్నెట్, గూగుల్, డిస్కవరీ పోటీ పడుతున్నాయి. టెండర్ పత్రాలు సమర్పించేందుకు జనవరి 12 చివరి తేదీ.
మీడియా హక్కులకు బీసీసీఐ కనీస ధర నిర్ణయించలేదు. మీడియా హక్కుల వ్యవహారం పూర్తయ్యాక ఫ్రాంచైజీలను విక్రయించనుంది. ప్రసార హక్కుల విలువను బట్టి ఆదాయంపై ఫ్రాంచైజీలు అంచనాకు రానున్నాయి. 'మీడియా హక్కుల వ్యవహారం పూర్తవ్వగానే ఫ్రాంచైజీ హక్కుల టెండర్లను ఆహ్వానిస్తాం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మహిళల ఐపీఎల్‌లో ప్రతి ఫ్రాంచైజీ రూ.1000 కోట్లకు పైగా ఆదాయం సృష్టిస్తాయని అంచనా వేశారు.
ఇప్పుడున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలే అమ్మాయిల జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. అయితే జోన్ల వారీగా ఫ్రాంచైజీలను విక్రయించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలిసింది. నార్త్ (ధర్మశాల/జమ్ము), సౌథ్ (కోచి/వైజాగ్), సెంట్రల్ (ఇండోర్/రాయ్‌పుర్/నాగ్‌పుర్), ఈస్ట్ (రాంచీ/కటక్), నార్త్ ఈస్ట్ (గువాహటి), వెస్ట్ (పుణె/రాజ్‌కోట్) ప్రాతిపదికన జట్లను విక్రయించే అవకాశం ఉంది. కాగా పురుషుల ఐపీఎల్ వేదికల్లో మొదట ఈ మ్యాచులు జరగవు. రెండో దశలో అహ్మదాబాద్, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఉండొచ్చు. వీటిపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.