AUS vs WI 2nd Test Day 4: కాలి వేలు విరిగినా ఆసీస్ వెన్ను విరిచాడు!
West Indies Vs Australia: వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై ఓ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 1997 తర్వాత, అంటే సుమారు 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ విజయం సాధించింది.
West Indies Vs Australia Test Series: టెస్ట్ క్రికెట్ చనిపోతోందీ అన్న వాదన తెరపైకి వచ్చిన ప్రతిసారీ ఓ మ్యాచ్ వస్తుంది... అందరి నోళ్లను మూయించడానికి. ఇప్పుడు అలాంటి టెస్ట్ మ్యాచే ఆస్ట్రేలియాలోని చారిత్రక గబ్బా స్టేడియంలో జరిగింది. వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై ఓ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 1997 తర్వాత, అంటే సుమారు 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా మీద టెస్టుల్లో 21 ఏళ్ల తర్వాత దక్కిన విజయం ఇది. మూడేళ్ల క్రితం గబ్బాలో మన టీమిండియా సృష్టించిన చరిత్ర గురించి తెలిసిందేగా. అప్పుడు అనేక మంది హీరోలు ఉన్నారు. రిషబ్ పంత్ మెయిన్. ఇప్పుడు వెస్టిండీస్ లో కూడా అంతే. ఒక్కడే మెయిన్ హీరో. షమార్ జోసెఫ్. పేరు పెద్దగా విని ఉండరు. ఈ రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లోనే డెబ్యూ చేశాడు. ఆడుతున్న రెండో టెస్టులోనే చారిత్రక విజయాన్ని కట్టబెట్టాడు. దాని వెనుక ఓ స్ఫూర్తిదాయక స్టోరీ కూడా ఉంది.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన అదిరిపోయే యార్కర్ కు జోసెఫ్ కాలి బొటనవేలు విరిగింది. బ్యాటింగ్ కూడా మళ్లీ చేయకుండా రిటైర్డ్ ఔట్ అయిపోయాడు. ఇవాళ అసలు బౌలింగ్ వేస్తాడా అన్న పరిస్థితి. అదృష్టవశాత్తూ ఫ్రాక్చర్ ఏమీ కాకపోవటంతో బౌలింగ్ కు వచ్చాడు. లిటరల్ గా నిప్పులు చెరిగాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. 216 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఒకానొక సమయంలో 113 ఫర్ 2. క్రీజులో స్టీవ్ స్మిత్, క్యామెరూన్ గ్రీన్ బాగానే నిలదొక్కుకున్నారు. అప్పుడు వచ్చాడు షమార్ జోసెఫ్. వరుస రెండు బాల్స్ లో గ్రీన్, హెడ్ ను ఔట్ చేసి వెస్టిండీస్ ను మళ్లీ గేమ్ లోకి తీసుకొచ్చాడు.
అప్పట్నుంచి వచ్చిన ప్రతి ఒక్క బ్యాటర్ నూ ఇబ్బంది పెట్టాడు. ఎక్స్ ప్రెస్ పేస్ తో, తీవ్రంగా ఇబ్బందిపెట్టే లైన్ అండ్ లెంగ్త్ తో అసలు రెండో టెస్టు ఆడుతున్న పేసర్ లానే కనపడలేదు. ఎంతో అనుభవమున్నవాడిలానే ఆడాడు. ఓ ఎండ్ లో స్టీవ్ స్మిత్ నిలబడిపోయినా సరే మారథాన్ స్పెల్స్ వేసి మొత్తం మీద 7 వికెట్లు తీశాడు. చివర్లో స్టీవ్ స్మిత్ 91 పరుగుల వద్ద నాటౌట్ గా మిగిలిపోయాడు. ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ అయి, లక్ష్యానికి కేవలం 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆఖరుగా హేజిల్ వుడ్ వికెట్ కూడా జోసెఫే తీశాడు. తీసిన వెంటనే ఇక అంతే. జట్టంతా సంబరాల్లో మునిగిపోయింది. గ్రౌండ్ లో పరిగెత్తేశారు. ఎందుకంటే అంతటి అపురూప విజయం ఇది. 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద దక్కిన విజయం. మొత్తానికి ఓ థ్రిల్లింగ్ టెస్ట్ మ్యాచ్ చూసిన మజా అయితే క్రికెట్ ఫ్యాన్స్ కు దక్కింది.
ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 311 పరుగులు స్కోర్ చేస్తే, ఆస్ట్రేలియా 289 స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ 193 స్కోర్ చేసి ఆస్ట్రేలియా ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిలిపితే, షమార్ జోసెఫ్ విరోచిత స్పెల్ తో విండీస్ కు విజయాన్ని అందించి సిరీస్ ను 1-1 తో సమం చేశాడు. ట్రోఫీని ఇరుజట్లూ పంచుకోబోతున్నాయి.