Mickey Arthur: "ఆర్థర్ ఏడుపు"పై మండిపడ్డ పాక్ మాజీలు
Mickey Arthur: భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించి కోచ్ మికీ ఆర్థర్‌పై వ్యాఖ్యలపై పాక్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ మండిపడ్డాడు. మిక్కీ అస్సలు ఎందుకు అలా మాట్లాడాడో తనకు అర్థం కావడం లేదన్నాడు.
ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిదోసారి భారత్ చేతుల్లో చిత్తుగా ఓడడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. భారత బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలిన దాయాది జట్టు రోహిత్ శర్మ విధ్వంసంతో కేవలం 30 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించడం పాక్ మేనేజ్‌మెంట్‌కు మింగుడపడడం లేదు. భారత్-పాక్ మ్యాచ్ ఐసీసీ ఈవెంట్‌లా అనిపించ లేదని... బీసీసీఐ కార్యక్రమంలా ఉందని ఇప్పటికే పాక్ కోచ్ మికీ ఆర్థర్ ఏడ్చేశాడు. తమకు ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడినట్లు ఉందని... మ్యాచ్ సందర్భంగా ఒక్కసారి కూడా పాకిస్థాన్ జట్టుకు అనుకూలంగా మద్దతు లభించలేదని అర్థర్ మ్యాచ్ ఆనంతరం వ్యాఖ్యానించాడు. ఇది తమ జట్టు ఓటమికి ఓ కారణం కావచ్చంటూ ఆర్థర్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు, పాక్ మాజీ క్రికెటర్లే మండిపడుతున్నారు.
భారత్-పాక్ మ్యాచ్ ద్వైపాక్షిక సిరీస్‌లా ఉందన్న పాక్ కోచ్ మికీ ఆర్థర్‌పై వ్యాఖ్యలపై పాక్ మాజీ కెప్టెన్, దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్ మండిపడ్డాడు. మిక్కీ అస్సలు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు ఇచ్చాడో తనకు అర్థం కావడం లేదని వసీం ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుల్‌దీప్ సహా టీమిండియా బౌలర్లను ఎదుర్కోనేందుకు అసలు మీ దగ్గర ప్రణాళికలు ఉన్నాయని అని నిలదీశాడు. మీక్కి అర్థర్ ఆ విషయం చెప్తే వినాలని ఉందని వసీం అక్రమ్ ఎద్దేవా చేశాడు. పాక్ కోచ్ అసలు విషయాలు వదిలిపెట్టి చెత్త విషయాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు. ఒకవేళ మీరు చెప్పలేకపోతే ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో ఉండడం అనవసరమని కూడా వసీం వ్యాఖ్యానించాడు. ఆటలో గెలుపోటములు సహజమే అని.. కానీ ఎందుకు ఓడిపోయామో తెలియాలని అన్నాడు. మిక్కీ అర్థర్ ఇలాంటి వ్యాఖ్యలతో అందిర దృష్టి పాక్ ఓటమి నుంచి మళ్లించాలని చూస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ మాజీ స్టార్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ కూడా మిక్కీ అర్థర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ను విమర్శించే బదులు, వారిని ప్రశంసించాలని మాలిక్ అన్నారడు. పాక్ జట్టును ఎలా ఉత్సాహపరచాలో.. టీమిండియా నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో చెప్పాలని ఆర్థర్‌కు సూచించాడు. పాకిస్థాన్ కూడా ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అలాంటి వాతావరణాన్ని సృష్టించాలని మాలిక్ సూచించాడు. బీసీసీఐను మెచ్చుకోవాలని, మనంకు కూడా ఇలాంటి పరిస్థితులను సృష్టించాలని మాలిక్ అన్నాడు.
మరో పాక్ మాజీ ఆటగాడు మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ కూడా అర్థర్‌పై మండిపడ్డాడు. పాక్ మిక్కీ అర్థర్ పాక్ ఓటమిని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాడని మండిపడ్డాడు. భావోద్వేగ వ్యాఖ్యలు చేయడం వల్ల సానుభూతి పొందాలని చూస్తున్నట్లుందని మొయిన్ ఖాన్ అన్నాడు. ప్రతీ జట్టుకు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుందని... దానికి సిద్ధమయ్యే బరిలోకి దిగాలని వెల్లడించాడు. భారత్-పాక్ మ్యాచ్‌ను అద్భుతంగా నిర్వహించినందుకు బీసీసీఐని ప్రశంసించాలని కూడా మొయిన్ ఖాన్ అన్నాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాకిస్థాన్‌ను చిత్తు ఓడించింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ విలవిల్లాడింది. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ విసిరే బంతులను ఎదుర్కోలేక జట్టులోని ఆరుగురు బ్యాటర్‌లు రెండంకెల స్కోర్ కూడా చేయకుండా పెవిలియన్ బాటపట్టారు. దాంతో నిర్ణీత 50 ఓవర్లు కూడా ఆడకుండానే పాక్ ఇన్నింగ్స్‌ను ముగించింది. తరువాత బ్యాటింగ్‌లోనూ భారత్ చెలరేగిపోయింది. దీంతో వన్డే ప్రపంచకప్ 2023లో విజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (86) మరోసారి చెలరేగిపోవడంతో పాకిస్థాన్ నిర్దేశించిన 192 స్వల్ప పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే ఛేదించింది.