Virat Kohli : వన్డేల్లో సచిన్ కంటే విరాటే గ్రేట్- అందరిలోనూ స్ఫూర్తి నింపుతాడని ఆస్ట్రేలియా ప్లేయర్
Virat Kohli : వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అభిప్రాయపడ్డాడు.
వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మాట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ మెరుగ్గా కనిపిస్తున్నాడని అంచనా వేశాడు. సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడని కానీ సచిన్ కంటే సగటు చాలా ఎక్కువగా ఉందని ఖవాజా అన్నాడు. తాము ఎదుగుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ బెంచ్‌మార్క్ అని ప్రశంసల వర్షం కురిపించాడు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లి వన్డేల్లో సచిన్ కంటే అద్భుతంగా రాణిస్తున్నాడని ఖవాజా తెలిపాడు. సచిన్ టెండూల్కర్ 463 వన్డేల్లో 44.83 సగటుతో 86.24 స్ట్రైక్ రేట్‌తో 18426 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ వన్డే ఫార్మాట్‌లో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ భారత్ తరఫున 284 వన్డేల్లో 13239 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో 47 సెంచరీలు...68 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ గణాంకాలే వన్డే ఫార్మాట్‌లో సచిన్ కంటే విరాటే మెరుగైన బ్యాటర్ అని చెప్తున్నాయని ఖవాజా తెలిపాడు.
ఇక ఈ తరం క్రికెటర్లకు విరాట్ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఓడించి అఫ్గానిస్తాన్ పెను సంచలనం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 57 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు.బ్రిటీష్ బౌలర్లను ఊచకోత కోసిన గుర్బాజ్ బ్యాటింగ్ మెరుపుల వెనక మన కింగ్ ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్బాజే స్వయంగా వెల్లడించాడు. మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేసిన తర్వాత గుర్బాజ్.. తన అద్భుత ఇన్నింగ్స్‌కు కోహ్లీ ఎలా సహకరించాడో చెప్పాడు. ప్రపంచంలోని ప్రతి యువ ఆటగాడికి కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తాడని గుర్బాజ్ అన్నాడు. కోహ్లీ తనకు గేమ్ ప్లాన్ గురించి, ఇన్నింగ్స్‌ని ఎలా నిర్మించడం గురించి.. మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడం గురించి పలు సూచనలు చేశాడని గుర్బాజ్ తెలిపాడు. తన బ్యాటింగ్ నైపుణ్యంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడని వెల్లడించాడు. కోహ్లీ ఇచ్చిన విలువైన సలహాలతో తన బ్యాటింగ్‌ను మెరుగు పెట్టుకున్నట్లు గుర్బాజ్ తెలిపాడు. కోహ్లీ అందరిలోనూ స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగుతాడని పొగడ్తల వర్షం కురిపించాడు.
ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించి ఊపు మీదుంది. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. రెండో మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా కేవలం 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది. చిరకాల ప్యతర్థి పాక్‌పై మూడో విజయం సాధించిన టీమిండియా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కనీసం 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ నిర్దేశించిన 192 స్వల్ప పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 30.3 ఓవర్లలోనే ఛేదించింది.