టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌తో కలిసి క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని
UK PM Rishi Sunak: ప్రతిరోజూ ఊపిరిసలపని పనులతో బిజీ బిజీగా గడిపే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ బ్యాట్, బాల్ పట్టి అలరించారు.
Viral Video: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ రోజులో ఏ నిమిషం ఎక్కడుండాలి..? ఏం చేయాలి..? ఎవరికి ఎంత సమయం కేటాయించాలి..? అన్నదంత షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. నిత్యం ఊపిరిసలపని పనులతో బిజీగా ఉండే ఆయన.. వాటన్నింటినీ పక్కనబెట్టి బ్యాట్, బాల్ పట్టారు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ తో క్రికెట్ ఆడారు. వారితో సరదాగా గడిపారు. క్రికెట్ లో తనకు ఉన్న నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఛాంపియన్స్ గా నిలిచిన జోస్ బట్లర్ అండ్ కో. ను రిషి సునక్ తన అధికారిక నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రపంచకప్ నెగ్గిన ఇంగ్లాండ్ క్రికెటర్లు కెప్టెన్ బట్లర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సామ్ కరన్, సెమీస్ లో భారత్ బౌలర్లను ఉతికారేసిన డేవిడ్ మలన్, ఫిల్ సాల్ట్, మిల్స్, క్రిస్ జోర్డాన్ లు రిషి సునక్ ఉంటున్న 10 డౌనింగ్స్ స్ట్రీట్ కు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించిన రిషి సునక్.. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడారు. ముందు బ్యాటింగ్ చేసిన సునక్.. ఫ్రొఫెషనల్ క్రికెటర్ మాదిరిగా బ్యాటింగ్ చేశారు. తాను ఆడిన తొలి బంతిని డిఫెన్స్ చేసిన ఆయన.. రెండో బంతిని కవర్ డ్రైవ్ షాట్ ఆడారు. సామ్ కరన్ వేసిన బంతిని కూడా స్లిప్స్ వైపునకు తరలించారు. కానీ క్రిస్ జోర్డాన్ వేసిన బంతిని అలాగే ఆడబోయి స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చారు.
బ్యాటింగ్ చేసిన తర్వాత బంతి పట్టిన సునక్.. సామ్ కరన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్ తీశాక ప్రధాని.. క్రికెటర్ల మాదిరిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. స్వతహాగా క్రికెట్ కు వీరాభిమాని అయిన సునక్.. తాజాగా తన క్రికెటింగ్ స్కిల్స్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతోంది.
కాగా గతేడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా ) వేదికగా ఇంగ్లాండ్ - పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్.. 19 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి రెండో టీ20 ప్రపంచకప్ ను గెలుచుకున్న విషయం విదితమే. టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు ఆ తర్వాత వరుస ఓటములతో సతమతమవుతోంది. ఆ టోర్నీ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోయిన బట్లర్ గ్యాంగ్.. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ ను 1-2 తేడాతో ఓడి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్నది. ప్రస్తుతం ఇంగ్లాండ్ కు అంతర్జాతీయ సిరీస్ లు ఏమీ లేకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఇండియాలో జరుగబోొయే ఐపీఎల్ కు పయనమయ్యారు.