WTC Points Table: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, రెండో స్థానానికి ఎగబాకిన భారత్
WTC 2023–25 Points Table: రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించడంతో భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో తిరిగి రెండో స్థానానికి ఎగబాకింది.
World Test Championship Rankings: రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్(England)ను చిత్తుగా ఓడించడంతో భారత్(Team India) ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టిక( World Test Championship Table )లో తిరిగి రెండో స్థానానికి ఎగబాకింది. గతవారం దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు టెస్టులు నెగ్గిన న్యూజిలాండ్ 75 శాతంతో అగ్రస్థానానికి చేరుకోగా, అప్పటిదాకా టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి, రెండులో ఉన్న భారత్ మూడో స్థానానికి పడిపోయింది. తాజాగా ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించడంతో రోహిత్ సేన రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 59.52 శాతంతో రోహిత్ సేన రెండో స్థానంలో ఉండగా.... 55 శాతంతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉండగా.. ఇంగ్లండ్ 21.88 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది.
మూడో టెస్ట్‌లో ఘన విజయం
రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా(India) ఘన విజయం సాధించింది.ఇంగ్లాండ్(England)పై ఏకంగా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్ ద్వి శతక గర్జనతో బ్రిటీష్ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అయిదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. మూడో రోజు ఆటకు అర్ధాంతరంగా దూరమైన అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చి వికెట్ సాధించగా... వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకం సాధించి సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటాడు.
రోహిత్ ఏమన్నాడంటే....
ఇంగ్లాండ్ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగానే ఆడి తమను ఒత్తిడిలోకి నెట్టారని రోహిత్ అన్నాడు. తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని... ప్రత్యర్థి బ్యాటర్లు బజ్‌బాల్‌తో దూకుడుగా ఆడుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఉండాలని తమ బౌలర్లకు చెప్పానని రోహిత్ తెలిపాడు. కానీ మూడో రోజు తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారని తెలిపాడు. టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు రెండు, మూడు రోజులపైనే దృష్టి పెట్టుద్దని... చివరి రోజు వరకు మ్యాచ్‌ను పొడిగించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నామని హిట్ మ్యాన్ తెలిపాడు.
రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ కీలక పరుగులు సాధించాడు. సర్ఫరాజ్ నాణ్యమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడని రోహిత్ తెలిపాడు. ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్, శుబ్‌మన్ గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారని అన్నాడు. వారిద్దరూ మాకు కావాల్సిన ఆధిక్యాన్ని అందించారుని జైశ్వాల్ గురించి ఎంత చెప్పకున్న తక్కువే. అతడొక అద్బుతం.. ఇదే విషయంపై చాలా సార్లు ఇప్పటికే చెప్పానని తెలిపాడు. యశస్వీ భవిష్యత్తులో కచ్చితంగా వరల్డ్‌క్రికెట్‌ను ఏలుతాడని హిట్ మ్యాన్ తెలిపాడు.