U-19 Asia Cup: నిప్పులు చెరిగిన రాజ్ నింబానీ, భారత్ చేతిలో నేపాల్ చిత్తు
India vs Nepal, U-19 Asia Cup 2023: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యువ భారత్ సత్తా చాటింది.
Cricket U-19 Asia Cup 2023: అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యువ భారత్ సత్తా చాటింది. నేపాల్‌ను చిత్తుచిత్తుగా ఓడించి సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. భారత్ యువ పేసర్ రాజ్ లింబాని ధాటికి నేపాల్ బ్యాటర్లు విలవిల్లాలాడారు. ఏడు వికెట్లతో చెలరేగిన లింబానీ నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. 9.1 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చిన బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచి నిప్పులు చెరిగాడు. ఆరాధ్య శుక్లా రెండు, అర్షిన్ కులకర్ణి ఒక వికెట్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 22.1 ఓవర్లలోనే కేవలం 52 పరుగులకే ఆలౌట్ అయింది.
కీలకమైన ఈ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడ్డ భారత జట్టు టాస్ గెలి చి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా.. నేపాల్ 22.1 ఓవర్లలోనే కేవలం 52 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఓపెనర్లు ఆదర్శ్, అర్షిన్ కులకర్ణి విజయతీరాలకు చేర్చారు. ఆదర్శ్ 13 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షిన్ 30 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. నేపాల్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందుకు దూసుకెళ్లింది. ఈ గెలుపుతో భారత జట్టు సెమీస్ బెర్తును అనధికారికంగా ఖాయం చేసుకుంది.
అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్లతో అఫ్ఘానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అఫ్ఘాన్ నిర్ధేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 37.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అర్షిన్ కులకర్ణీ ముందు బౌలింగ్‌లో (3/46), తర్వాత బ్యాటింగ్‌లో (70 నాటౌట్; 105 బంతుల్లో 4 ఫోర్లు) సత్తా చాటాడు. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైపోయింది. భారత్ 37.3 ఓవర్లలో 174/3 పరుగులు చేసి టోర్నీలో శుభారంభం చేసింది.
రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో భారత యువ జట్టుకు చుక్కెదురైంది. ఆసియాకప్‌లో ఇప్పటివరకూ ఓటమంటూ ఎరుగకుండా ముందుకు సాగిన టైటిల్ ఫేవరెట్ అయిన యువ భారత్ ఈ ఓటమితో డీలాపడింది. గ్రూప్-ఎలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్లతో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్ష్ సింగ్ (62), కెప్టెన్ ఉదయ్ సహ్రాన్ (60), సచిన్ దాస్ (58) అర్ధ శతకాలు వ్యర్థమయ్యాయి. పాక్ బౌలర్లు మహ్మద్ జీషన్ (4/46), ఆమిర్ హసన్ (2/56), ఉబేద్ షా (2/49) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అనంతరం పాక్ బ్యాటర్ అజాన్ అవైస్ (105 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటడంతో పాక్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. పాక్ మరో 18 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 47 ఓవర్లలో 2 వికెట్లకు 263 పరుగులు సాధించింది. అజాన్ సెంచరీకి.. షాజైబ్ ఖాన్ (63), కెప్టెన్ సాద్ బేగ్ (68 నాటౌట్) అర్ధ శతకాలు తోడవడంతో పాక్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. భారత బౌలర్ మురుగన్ అభిషేక్ (2/55)కు రెండు వికెట్లు దక్కాయి.