India vs Australia: టీ 20 మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు, లోపలికి అనుమతి ఎప్పటినుంచంటే..?
IND vs AUS: భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య తొలి ట్వంటీ-20 సమరానికి విశాఖలోని V.C.A-V.D.C.A స్టేడియం సిద్ధమైంది. మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
India vs Australia T20: భారత్ - ఆస్ట్రేలియా(India Vs Austrelia) క్రికెట్ జట్ల మధ్య తొలి ట్వంటీ-20 (T20) సమరానికి విశాఖ(Visakha) లోని V.C.A-V.D.C.A స్టేడియం సిద్ధమైంది. మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరగనున్న అంతర్జాతీయ టీ-20 క్రికెట్ మ్యాచ్ కు వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. రాత్రి ఏడు గంటల నుంచి 11 గంటల వరకు జరిగే డే అండ్ నైట్ మ్యాచ్ కు సాయంత్రం 5 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తారు. సుమారు 28 వేల మంది ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటానికి ఈ స్టేడియంలో సామర్ధ్యం ఉంది. 30కు పైగా గేట్లు ద్వారా లోపలలకు ప్రవేశించే అవకాశం ఉంది. ఎటువంటి అపశ్రుతులూ జరగకుండా స్టేడియం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి స్టేడియంలోనికి వెళ్లే అన్ని గేట్ల వద్ద ACP స్థాయి అధికారులను బందోబస్తుగా నియమించారు.
ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి, టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వరుసలో లోపలికి పంపేలా ఏర్పాట్లు చేశారు. స్టేడియం వద్ద మూడంచెల భద్రతతో పలు సెక్టార్లుగా విభజించి స్టేడియం లోపలా, వెలుపలా, చుట్టూ ఉన్న బహుళ అంతస్తుల పైన, రూఫ్ టాప్ లపైన పూర్తి భద్రత ఏర్పాటు చేసి, జన సామ్యార్థం ఎక్కువుగా ఉండే ప్రతి చోటా ఎటువంటి అవాంతరాలు లేకుండా బందో బస్తు ఏర్పాట్లు చేశారు. ఈ అంతర్జాతీయ టీ-20 క్రికెట్ మ్యాచ్ నకు సుమారు 2,000 మంది అధికారులు, సిబ్బందితో పూర్తి భద్రత, పర్యవేక్షణతో బందోబస్తూ ఏర్పాటు చేశారు. మ్యాచ్ టిక్కెట్ ను చింపితే ఆకుపచ్చ రంగు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా చేయడం వల్ల నకిలీ టికెట్ల బెడద తప్పుతుందని పోలీసులు తెలిపారు. మ్యాచ్ టిక్కెట్ ను సమాంతరంగా పెట్టి చూస్తే గోల్డ్ కలర్ సెక్యూరిటీ త్రెడ్ కనిపిస్తుంది. అలా కనిపిస్తేనే ఆ టికెట్ అసలైనదిగా పరిగణిస్తారు. మ్యాచ్ టిక్కెట్ పై గల బార్ కోడ్ స్కాన్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. అలా మ్యూజిక్ వస్తేనే ఆ టికెట్ అసలైనదిగా పరిగణించాలని పోలీసులు సూచించారు.
ప్రతి టిక్కెట్ పై వారు వెళ్లాల్సిన స్టాండ్, గేట్ నెంబర్లు, టికెట్ డినామినేషన్, సీట్ నెంబరు ఉంటుంది. వాటి ఆధారంగా ప్రేక్షకులు వారి సీట్లకు వెళ్లవచ్చు. మ్యాచ్ సందర్భంగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కలర్ జిరాక్స్ తీసిన టిక్కెట్స్ అమ్మి మోసగిస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు వద్ద కలర్ జిరాక్స్ తీసిన టిక్కెట్స్ కొనుక్కుని మోసపోవద్దని నిర్వాహక కమిటీ వెల్లడించింది. మ్యాచ్ సందర్భంగా బయట నుంచి తెచ్చే తినుబండారాలు, వాటర్ బాటిల్స్ స్టేడియంలోకి అనుమతించరు. ▪️స్టేడియం మొత్తం CC కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రేక్షకులు ఎవరైనా ఎటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా, పరిధి దాటి ఆటగాళ్లతో సెల్ఫీలు తీసుకున్నా, సెల్ఫీలు తీసుకోవటానికి ప్రయత్నించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.