T20 World Cup 2024: పబ్లిక్ బాలెట్ ద్వారా టీ 20 ప్రపంచకప్ టికెట్లు
Mens T20 World Cup 2024 Tickets: జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా(Canada) తలపడబోతోంది. టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది.
Ticket sales for Mens T20 World Cup 2024 open with a public ballot: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా(Canada) తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్(Bharat), పాకిస్థాన్(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఐసీసీ నాలుగు నెలలు ఉండగానే అందుబాటులోకి తెచ్చి షాక్ ఇచ్చింది.
ఎలా బుక్ చేసుకోవాలంటే..
క్రికెట్ అభిమానులు ప్రతీ ఒక్కరికి పారదర్శకంగా టికెట్లు లభించాలనే ఉద్దేశంతో పబ్లిక్ బ్యాలట్ ద్వారా టీ 20 ప్రపంచకప్ టికెట్లను ఐసీసీ అందుబాటులో ఉంచింది. పురుషుల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలను ప్రారంభించినందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉందని.. ప్రపంచలోని అభిమానులందరికీ నిష్పక్షపాతంగా టికెట్లు అందించాలనే ఆలోచనతో పబ్లిక్ బ్యాలట్ ద్వారా టికెట్లు అమ్ముతున్నామని ఐసీసీ ప్రకటించింది. ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా క్రికెట్ అభిమానులు టికెట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్ బ్యాలట్ ద్వారా టికెట్లను tickets.t20worldcup.com లో ఐసీసీ అందుబాటులో పెట్టింది. టికెట్ల ధరను 6 డాలర్ల నుంచి 25 డాలర్లుగా నిర్ణయించింది. భారతీయ కరెన్సీలో కనీస టికెట్ ధర రూ.497 కాగా అత్యధిక ధర రూ.2 వేల వరకు ఉంది. ఏకంగా 2.60 లక్షల టికెట్లను ఐసీసీ అమ్మకానికి పెట్టింది. ఒక్కొక్కరు ఆరు టికెట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలా ఎన్ని మ్యాచ్‌లకైనా ఒక్కరు ఆరేసి టికెట్లకు అప్లై చేయవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 23 గంటల 59 నిమిషాల వరకు టికెట్లకు అప్లై చేసుకొనే వీలుంది.
బరిలో 20 జట్లు
2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జట్లు పోటీ పడగా ఈ సారి మాత్రం 20 జట్లు తలపడనున్నాయి. ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లలతో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ లతో కలిపి మొత్తం 10 జట్లు నేరుగా అర్హత పొందాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, పది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియన్ల వారీగా క్వాలిఫయింగ్ పోటీలను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, యూఎస్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్, కెనడా, నేపాల్, ఒమన్, పపువా న్యూ గినియా, ఐర్లాండ్, స్కాంట్లాండ్, ఉగాండ, నబీబియా పాల్గొననున్నాయి. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిని.. టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని మరిపించాలని టీమిండియా కోరుకుంటోంది.