Look Back 2024 In Sports: తగ్గేదే లే.. 2024లో అదరగొట్టిన టీమిండియా.. అటు ర్యాంకుల్లోనూ, ఇటు రికార్డుల్లోనూ జోరు.. అభిమానులకు గుర్తుండి పోయేలా ఆటతీరు
Rewind 2024: ఆఖరిలో తడబడినా 2024లో అటు ర్యాంకింగ్స్ పరంగా , ఇటు రికార్డుల పరంగా టీమిండియా అనేక ఘనతలు సాధించింది. పొట్టి ప్రపంచకప్ ను కొట్టి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

Flashback 2024: టీమిండియా క్రికెట్ జట్టుకు 2024 మధురంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేలను మినహాయిస్తే, అటు టెస్టుల్లోనూ, ఇటు టీ20ల్లోనూ తనదైన ముద్ర వేసింది. కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. 2024 సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు గొప్ప సంవత్సరం అని విశ్లేషకులు సైతం అభివర్ణిస్తున్నారు. ఈ ఏడాది భారత జట్టు ఎన్నో ఘన విజయాలు సాధించింది. ముఖ్యంగా T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకోవడంతోపాటు ICC ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సాధించడం కూడా విశేషం..
టీ20 మ్యాచుల్లో టీమ్ ఇండియా ఎన్నో అద్భుతమైన రికార్డులు నమోదు చేసింది. ఈ క్రమంలో టెస్టు, ODI మరియు T20 ఫార్మాట్‌లలో భారత జట్టు ఆటతీరు ఎలా ఉందో తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ కైవసం..
2007లో పొట్టి ప్రపంచకప్ ను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో సాధించాక, ఆ తర్వాత రెండోసారి టైటిల్ సాధించేందుకు భారత జట్టు 17 ఏళ్ల పాటు కష్టపడాల్సి వచ్చింది. 2014లో భారత జట్టు ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత భారత జట్టు 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ లో ఆమీతుమీ కి సిద్ధమైంది. . ఈ మ్యాచ్ లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో గెలిచి 2024 T20 వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఐసిసి ర్యాంకింగ్స్‌లోని మూడు ఫార్మాట్లలో ఆధిపత్యం..
ఇక ఈ ఏడాది ఒక దశలో మూడు ఫార్మాట్లలో నెం.1 గా నిలిచి అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఐసిసి ర్యాంకింగ్స్‌లో భారత జట్టు టెస్ట్‌లలో రెండవ స్థానంలో ఉంది. వన్డేలు, టీ20ల్లో టీమిండియా నంబర్‌వన్ స్థానంలో ఉంది.
టెస్టులు: ఏడాది ఆరంభంలో టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు ఐపీఎల్ వరకు, భారత్ 122 రేటింగ్‌తో టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకులోనే కొనసాగింది. ఆ తర్వాత టెస్టుల్లో కొన్ని పరాజయాల తర్వాత టీమ్ ఇండియా ర్యాంకు కాస్త పడిపోయింది. ఇప్పుడు ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 111 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. అయితే 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోవడం కాస్త మచ్చలాంటిదే. అది కూడా భారత గడ్డపై దశాభ్దాల పాటు టెస్టు విజయం చూడని కివీస్ కు కోల్పోవడం అభిమానులను కలవరపరిచింది.
వన్డేలు: నిజానికి పెద్దగా వన్డేలు ఆడనప్పటికీ, ఏడాది పొడవునా వన్డే ఫార్మాట్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 118 రేటింగ్‌తో ODI ర్యాంకింగ్స్‌లో టాప్ లేపింది. ఏడాది చివరకు రావడం, ప్రస్తుతం భారత ర్యాంకుపై ప్రభావం చూపే సిరీస్ లు పెద్దగా లేకపోవడంతో ఇదే ర్యాంకుతో ఈ ఏడాదిని భారత్ ముగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
టీ20: టీ20 క్రికెట్‌లో టీమ్ ఇండియా కూడా ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఫార్మాట్లో భారత్ ఖాతాలో 268 పాయింట్లు ఉన్నాయి. దీంతో T20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఏదేమైనా కొన్ని అనుకోని పరాజయాలతో టెస్టు నెం.1 ర్యాంకును చేజార్చుకున్నా వన్డేలు, టీ20లతో టాప్ ప్లేసుతో ఈ ఏడాదిని భారత్ ముగించనుంది.
రికార్డుల జోరు..
టీ20లో భారత జట్టు అమూల్యమైన రికార్డులను సాధించింది. 2024లో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా భారత జట్టు ఘనత వహించింది. 2024లో భారత్ మొత్తం 26 T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడగా, అందులో 24 గెలిచింది. కేవలం 2 మాత్రమే ఓడిపోయింది.
ఈ ఏడాది టీ20ల్లో భారత్ 216 సిక్సర్లు కొట్టగా, ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా నిలిచింది.
2024లో, టీ20ల్లో భారత ప్లేయర్లు 7 సెంచరీలు సాధించారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒక జట్టు చేసిన అత్యధిక సెంచరీల రికార్డుగా నమోదైంది. ఓవరాల్ గా 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ నెగ్గి జోష్ మీదున్న భారత జట్టు.. ర్యాంకింగ్స్ లోనూ ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో నిలిచింది.




















