టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌కి టీమిండియా వెళ్లడం అంత ఈజీ కాదా!
టీ 20 వరల్డ్ కప్ 2022లో ఫైనల్స్‌కి చేరుకోవాలంటే టీమిండియా తన చివరి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించాల్సి ఉంది.
టీ20 ప్రపంచకప్ 2022లో భారత జట్టు గత రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రొటీస్ జట్టు 5 వికెట్ల తేడాతో టీమ్ ఇండియాను ఓడించింది. ప్రస్తుతానికి ఈ ఓటమి భారత జట్టును బాధించకపోయినా సెమీస్‌కు చేరాలంటే మాత్రం రెండు మ్యాచ్‌లలో గెలవాల్సి ఉంది. తరువాతి రెండు మ్యాచ్‌లను గెలవడం ద్వారా సులభంగా సెమీ-ఫైనల్స్‌కు చేరుకోగలదు, కానీ ఇక్కడ వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. అదే ఇప్పుడు టీమిండియాను టెన్షన్ పెడుతోంది.
సూపర్ -12 రౌండ్‌లో భాగంగా టీమ్ ఇండియా తన చివరి రెండు మ్యాచ్‌లను బంగ్లాదేశ్, జింబాబ్వేతో ఆడాల్సి ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు ఓడిపోతే టీమ్ఇండియాకు గరిష్టంగా 6 పాయింట్లు లభిస్తాయి. ఇక్కడ బంగ్లా జట్టుకు కూడా 6 పాయింట్లు లభిస్తాయి. పాకిస్తాన్‌ను కూడా బంగ్లాదేశ్ ఓడిస్తే 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా కంటే ముందు వరుసలో నిలిచి సెమీస్‌కు చేరుకోవచ్చు. బంగ్లా జట్టు పాకిస్థాన్ చేతిలో ఓడిపోయి, ప్రొటీస్‌ను పాకిస్థాన్ జట్టు ఓడించినా, అప్పుడు పాక్ జట్టుకు 6 పాయింట్లు, మెరుగైన రన్ రేట్ ఆధారంగా భారత్ కంటే ముందుండే అవకాశం ఉంటుంది. అంటే భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతే పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌లో సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశాలు పెరుగుతాయి.
ఒకవేళ భారత జట్టు జింబాబ్వే చేతిలో ఓడితే...
ఒకవేళ భారత జట్టు బంగ్లాదేశ్‌పై గెలిచి జింబాబ్వే చేతిలో ఓడితే, ఈ పరిస్థితిలో జింబాబ్వే జట్టు దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. అయితే, జింబాబ్వే ముందు నెదర్లాండ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. డచ్ జట్టును ఓడించడం జింబాబ్వేకు పెద్ద కష్టమేమీ కాదు. ఈ పరిస్థితిలో భారత్‌కు 6 పాయింట్లు, జింబాబ్వే 7 పాయింట్లతో సెమీఫైనల్స్ కు చేరతాయి.
వర్షం ఆటను ఆపేస్తే...
రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దైతే... భారత్ 6 పాయింట్లు కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా జింబాబ్వేలో ఒకటి దక్షిణాఫ్రికాతో సెమీ ఫైనల్స్‌కు చేరుకోవచ్చు.
గ్రూప్-2 పాయింట్ల పట్టిక
జట్టు | మ్యాచ్‌లు | గెలుపు | ఓటమి | పాయింట్లు | నెట్ రన్ రేట్ |
దక్షిణాఫ్రికా | 3 | 2 | 0 | 5 | 2.772 |
టీమిండియా | 3 | 2 | 1 | 4 | 0.844 |
బంగ్లాదేశ్ | 3 | 2 | 1 | 4 | -1.533 |
జింబాబ్వే | 3 | 1 | 1 | 3 | -0.050 |
పాకిస్తాన్ | 3 | 1 | 2 | 2 | 0.765 |
నెదర్లాండ్స్ | 3 | 0 | 3 | 0 | -1.948 |